iDreamPost
android-app
ios-app

రెహమాన్ గౌతమ్ మీద విమర్శలు సబబేనా

  • Published Oct 06, 2021 | 4:49 AM Updated Updated Oct 06, 2021 | 4:49 AM
రెహమాన్ గౌతమ్ మీద విమర్శలు సబబేనా

నిన్న విడుదలైన ఏఆర్ రెహమాన్ బతుకమ్మ పాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రాంతీయ భావం లేకుండా ఏదో ప్రేమకథకు కంపోజ్ చేసినట్టు సంగీత దిగ్గజం ట్యూన్ ఇచ్చారని, దర్శకుడు గౌతమ్ మీనన్ సైతం తమిళ వాసనలతో నింపేశారని విమర్శలు వచ్చి పడుతున్నాయి, తెలంగాణ జాగృతి కవిత గారి మీద కామెంట్లు పడుతున్నాయి. ఇంతటి దానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారా అంటూ కొందరు విరుచుకుపడుతున్నారు. ఇదే బడ్జెట్ తో పదికి పైగా స్థానిక టాలెంట్ తో ఎన్నో గొప్ప పాటలు తీసిండొచ్చు కదా అని గతంలో వచ్చిన చార్ట్ బస్టర్స్ ని ఉదాహరణగా చూపించి పోలిక తెస్తున్నారు. ఇదో పెద్ద చర్చ అయ్యేలా ఉంది.

నిజానికి రెహమాన్ మేజిక్ ఎప్పుడో తగ్గిపోయింది. గత పదేళ్లలో ఆయన నుంచి వచ్చిన ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఏదంటే కొద్దినిమిషాలు ఆలోచించాల్సిందే. లేదూ అంటే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు, రోజా, భారతీయుడు లాంటి పేర్లే గుర్తుకు వస్తాయి. ఇక టేకింగ్ పరంగా గౌతమ్ మీనన్ ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా ఆయనకు స్థానిక వ్యవహారాల మీద అవగాహన తక్కువ. చిత్రీకరణ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ అది సగటు తెలంగాణ యాసకు గోసకు కనెక్ట్ అయ్యేది కాదు. కాస్ట్యూమ్స్ కూడా ఖరీదైనవి వాడటంతో ఎంతసేపూ గ్రాండియర్ కనిపిస్తోంది కానీ లోకల్ ఫీలింగ్ రావడం లేదు.

అలా అని నచ్చినవాళ్లు లేక కాదు. చాలా బాగుందని ప్రశంసిస్తున్న వాళ్ళు లేకపోలేదు. గీత రచయిత మిట్టపల్లి సురేందర్ గతంలో ఎన్నో మంచి తెలంగాణ పాటలు రాశారు. ఆయన సైతం ట్యూన్ ప్రభావం వల్ల పూర్తి స్థాయిలో మంచి సాహిత్యం ఇవ్వలేకపోయారన్న విశ్లేషణలు సాగాయి. ఈయన మినహాయించి దాదాపు గౌతమ్ టీమ్ అందరూ నాన్ తెలంగాణ బ్యాచే. కేరళ ఓనం, తమిళనాడు పొంగల్ లాంటి ప్రత్యేక సందర్భాలు మన తమన్నో లేక గౌతమ్ తిన్ననూరినో పిలిచి వాళ్ళు పాటలు చేయించుకుంటారా అని అడుగుతున్న వాళ్ళు లేకపోలేదు. మొత్తానికి క్రేజీగా వచ్చిన ఈ పాటకు ఇలాంటి స్పందన ఊహించనిది

Also Read : బంగార్రాజు ఎఫ్3ల తక్షణ కర్తవ్యం