Idream media
Idream media
విజయవాడ లో ఘోరం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఘోరానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసింది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం పేరుతో ఆమెను నమ్మించి ఆస్పత్రిలో ఉంచి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి అండగా ఉండాలని శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు.
కాగా, జరిగిన ఘటన దారుణం. బాధితురాలికి, ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాల్సిందే. ప్రభుత్వం తన బాధ్యతగా తగిన చర్యలు చేపట్టింది. అయితే.. దీనిపై కూడా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి విపక్షాలు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించడం విమర్శలకు దారి తీసింది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, బోడె ప్రసాద్ సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అంతటితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలు బూతులతో రెచ్చిపోయారు. పోలీసులు అదుపుచేసినా వారు తగ్గలేదు. లోనికి వెళ్లేముందు కూడా వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు తోసేశారు. దీంతో బాధితురాలిని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ అతికష్టం మీద ఆస్పత్రిలోకి వెళ్లాల్సి వచ్చింది.
ఎలాగోలా ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అనంతరం అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే.. టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వస్తే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మహిళల పట్ల రాజకీయం చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ని బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారారని విమర్శించారు. తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులకు ఏపీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విజయవాడలో విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పట్ల అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కమిషన్ చంద్రబాబు, బోండా ఉమాలకు సమన్లు జారీ చేసింది. అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించనీయకుండా, ఆమె ఆవేదనను వినకుండా కమిషన్ ఛైర్‌పర్సన్ విధులకు ఆటంకం కలిగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా వాసిరెడ్డి పద్మపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారని కమిషన్ ఆరోపించింది.