Idream media
Idream media
వ్యవసాయం దేశానికి వెన్నెముక అంటారు. అదే సమయంలో వ్యవసాయం జూదం లాంటిది అని కూడా అంటారు. ఎందుకంటే నమ్మకమైన రాబడి లేని రంగమేదైనా ఉందంటే అది వ్యవసాయ రంగమే. ఒక రైతు పంట వేయడానికి భూమిని తయారు చేసి, విత్తనాలు విత్తి, పంటను కాపాడుకొని, కోతలు కోసి, పంటను అమ్మే క్రమంలో ఏ ఒక్క చోట ఇబ్బందులు ఎదురైనా నష్టం తప్పదు. విత్తనాలు విత్తడానికి అదునులో వర్షాలు పడకపోయినా, పంట మధ్యలో అవసరమైనప్పుడు నీరు లేకపోయినా, నకిలీ విత్తనాలు వేసినా, కోతల సమయంలో అకాల వర్షాలు ముంచెత్తినా, చివరికి ధాన్యం అమ్మేటప్పుడు మద్ధతు ధర లభించకపోయినా రైతు ఆ ఏడాది అప్పుల పాలు కావలసిందే.
ప్రభుత్వాలు నిజాయతీగా పనిచేస్తే ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేయగలవు. మంచి మనసు, రైతులకు మంచి చేయాలనే తపన ఉంటే రైతులను కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోంది. రైతుల కోసం ఎలాంటి పనులు చేయడానికి సిద్దపడే ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే వినూత్న ఆలోచనలతో రైతాంగానికి మేలు చేసేందుకు కృషి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమావేశంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కోవిడ్ వార్తల వరదలో ఈ వార్త పత్రికల్లో ప్రాధాన్యత సంతరించుకోలేదు. కానీ ఆయన ప్రకటించిన ప్రణాళికలో అంతర్లీనంగా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి.
సీఎం జగన్ ఇంతకముందే గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలకు ఏర్పాటుకు ఆదేశించిన విషయం తెలిసిందే. దశల వారీగా అవి ఏర్పాటవుతున్నాయి. ఇందుకోసం రూ. 199 కోట్లు కూడా మంజూరు చేశారు. ఈ కేంద్రాల్లో నమోదయ్యే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇంటి వద్దకే అందిస్తారు. పంట వేసింది మొదలు, అమ్మే వరకు అన్ని రకాల సేవలకు ఈ రైతు భరోసా కేంద్రాలు అందిస్తాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సలహా మండళ్లను సీఎం ప్రకటించారు. ఇవి గ్రామ స్థాయిలో పంటల విషయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తాయి. అంటే భూమిని బట్టి ఏ పంట వేస్తే మేలు ఉంటుంది? ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుంది? అనే విషయాలను గ్రామాల్లో రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు పంటలు వేసేలా ప్రోత్సహిస్తారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల పంటలను అన్ని చోట్లా వేయడానికి వీలు పడుతుంది. పంటల అమ్మకాల సమయంలో పోటీ ఏర్పడి ధరలు తగ్గే ప్రమాదం ఉండదు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లను విశ్లేషించి ఏ ఏడాది ఏ పంటకు డిమాండ్ ఉంటుంది అనేది తేల్చుతారు. పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలని చూస్తారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే రైతులకు ఎంతో లబ్ధి కలుగుతుంది.
ఇవన్నీ చేయాలంటే ముందు నీరు అందుబాటులో ఉండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులపై కూడా సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పోలవరంతో సహా పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులకు పంటలు వేసే సమయంలో ఖర్చుల కోసం ఏటా 13,500 ఇస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఉచిత బోర్లు కూడా వేయనున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ రైతు అభివృద్ధే కేంద్రంగా సీఎం జగన్ ఆలోచిస్తూ, ప్రణాళికలను అమల్లోకి తెస్తూ ముందుకు సాగుతున్నారు.