గవర్నర్ ని కలసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

  • Published - 06:45 AM, Mon - 16 March 20
గవర్నర్ ని కలసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు ఆంద్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం సంచలనం నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ అంశంపై తాము గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి ఎన్.రమేష్‌కుమార్ సోమవారం ఉదయం గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ నివాసానికి వచ్చిన ఎన్నికల కమిషనర్ 10:30 కు గవర్నర్ తో భేటీ అయినట్టు తెలిసింది.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలపై రమేష్ కుమార్ గవర్నర్ కు సుదీర్ఘ వివరణ ఇచ్చినట్టు సమాచారం. వీరిరువురు మధ్య షుమారు 45 నిమిషాలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఎన్నికల వ్యవహారంపై గవర్నర్ ఈసీ కి ఎలాంటి సూచనలు ఇచ్చారో ఇంకా తెలియరాలేదు. అయితే ఈ పరిణామాలపైఎన్నికల కమిషనర్ గవర్నర్ కి ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ భేటీపై ఈసీ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ దీనిపై ఈసీ ఈరోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం వుంది. ఈ అంశంపై గవర్నర్ ఇచ్చే నివేదిక ను బట్టి ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి గవర్నర్ నివేదించే అవకాశం ఉందని రాజభవన్ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉంటే ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఈసీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పలు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఈ వ్యవహారంలో ఏవిధంగా ముందుకెళ్లనుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది.

Show comments