iDreamPost
android-app
ios-app

అంత ఈజీ కాదని తేల్చేసారా..?

  • Published Dec 06, 2020 | 2:46 AM Updated Updated Dec 06, 2020 | 2:46 AM
అంత ఈజీ కాదని తేల్చేసారా..?

ఒక్కో ఎన్నికల ఫలితాలు అంతే.. అనేక సమాధానాలు చెప్పడంతో పాటు, మరికొన్ని ప్రశ్నలు కూడా పుట్టిస్తుంటాయి. ప్రస్తుతం జీహెచ్‌యంసీ ఎన్నికల ఫలితాల తీరు అలాగే ఉంది. అధికార, ప్రతి పక్షాల వ్యూహాలను పూర్తిగా మార్చివేసే విధంగానే ఈ ఫలితాలు వచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు పరిశీలకులు. అంతే కాకుండా ఈ ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాల్లో ఆయా పార్టీల వ్యూవహాలను కూడా ప్రభావితం చేసే విధంగా కూడా ఉన్నాయన్నది అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో ఆంధ్రా నుంచి వెళ్ళి స్థిరపడిన సెటిలర్స్‌ మద్దతు టీఆర్‌ఎస్‌ వైపే ఉందన్నది తేలిపోయింది. అక్కడ గెల్చుకున్న సీట్లు టీఆర్‌ఎస్‌ పట్ల వారికున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తుండగా, అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ పట్ల మొగ్గు చూపలేదన్నది కూడా స్పష్టమవుతోంది. ఈ సెటిలర్స్‌ ఓటు రూపంలో వ్యక్తం చేసిన భావన తెలంగాణాకు మాత్రమే పరిమితం అయిపోతుందా? లేక వారి మూలాలు బలంగా ఉన్న ఆంధ్రాలో కూడా కొనసాగుతుందా? అన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల బుర్రలకు పదునుపెడుతోన్న ప్రశ్నగా మారిపోయింది.

నిజానికి తెలంగాణా ప్రాంతంలో స్థిరపడినప్పటికీ ఆంధ్రాలోని తమతమ ప్రాంత వాసులతో ఈ సెటిలర్స్‌ మంచి సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న కోవిడ్‌ లాక్డౌన్‌ అనంతం కూడా భారీగానే ఆంధ్రాప్రాంతానికి తరలివచ్చాన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ వైపే వారి నమ్మకం ఉండడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అయితే తెలంగాణా వాసులు కూడా ఈ పంథాకు వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఉదహరించే వారు కూడా లేకపోలేదు. అయితే వారు జాతీయ పార్టీగా బీజేపీకి మద్దతు ఇచ్చారనడం కంటే.. తెలంగాణాల్లోని రాజకీయ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, కరోనా, వరద సాయం తదితర అంశాల ప్రాతిపదకనే ప్రభావితం అయ్యుంటారన్న వాదన బలంగా విన్పిస్తోంది.

ఈ లెక్కన సెటిలర్స్‌ జాతీయ పార్టీని పట్టించుకోలేదన్నది తేలిపోయిన విషయం. ఇదే ధోరణి ఆంధ్రా ప్రాంతంలో కూడా కన్పిస్తుందన్న టాక్‌ ఇప్పుడు జోరందుకుంది. ఆంధ్రా ప్రాంతంలో బీజేపీ నడక నల్లేరుమీద బండి మాదిరిగా ఉండదన్నది తెలంగాణాలోని సెటిలర్స్‌ గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో తేల్చేసారని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టుకోవాల్సిన ఆవశ్యతను ప్రస్తావిస్తున్నారు. ఏపీలో అధికార పక్షం బలంగానే ఉంది. ప్రజలు ఇంకా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ పట్ల అక్కడి ప్రజల దృక్ఫథానికి, వైఎస్సార్‌సీపీ పట్ల ఆంధ్రా ప్రజల దృక్ఫథానికి చాలా తేడానే ఉన్నట్లు ఇప్పటికే పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రాలతో ఇప్పుడున్న స్థాయికంటే ఉన్నత స్థాయిని అందుకోవాలంటే బీజేపీ ముందు భారీ సవాళ్ళే ఎదురు చూస్తున్నాయన్నది సుస్పష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రా పట్ల బీజేపీ వ్యూహం ఏంటన్నది తేలాలంటే వేచి చూడక తప్పదన్నమాట.