iDreamPost
android-app
ios-app

తారా స్థాయికి అసహనం.. సిబ్బందిపై నిమ్మగడ్డ ప్రతాపం

తారా స్థాయికి అసహనం.. సిబ్బందిపై నిమ్మగడ్డ ప్రతాపం

పంచాయతీ ఎన్నికల నిర్వహణ తనకు చావు బతుకుల సమస్య అన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు. ఆరునూరైనా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ.. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యాలు పెట్టుకున్నారు. తాను అనుకున్నదే జరగాలని, ఎవరు అడ్డు వచ్చినా ఊరుకునేది లేదనేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తన సిబ్బందిపై ప్రతాపం చూపుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాగతం కలిగించారనే అభియోగంతో రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) జీవీ సాయి ప్రసాద్‌ను విధుల నుంచి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొలగించారు. ఎన్నికలు జరిగే సమయంలో సాయిప్రసాద్‌ సెలవు పెట్టారని, ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతోనే అతను సెలవు పెట్టాడనే భావనలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొనడం నిమ్మగడ్డలో అసహనం ఏ స్థాయిలో ఉందో తెలుపుతోంది.

ఆర్టికల్‌ 243కే రెడ్‌ విత్‌ 324 ప్రకారం తనకున్న అధికారాలను ఉపయోగించి సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్న నిమ్మగడ్డ.. తాను బలవంతుడననే సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఓ అధికారి పట్ల ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం చర్చనీయాంశమవుతోంది. కేవలం సెలవు పెట్టాడనే కారణంతో ఉన్నత స్థాయి కేడర్‌లోని అధికారిని విధుల నుంచి తొలగించడం నిమ్మగడ్డ వ్యవహార శైలికి అద్దం పడుతోంది. సెలవు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసుకోకుండా, కనీసం సాయి ప్రసాద్‌ వివరణ తీసుకోకుండా ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించడంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొత్త చిక్కులు తెచ్చుకున్నట్లైంది. పైగా సాయి ప్రతాప్‌ భవిష్యత్‌లో ప్రభుత్వంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పని చేసేందుకు వీలులేదంటూ కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నడం చూస్తుంటే.. కక్షపూరితంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోంది.

తనకు వచ్చిన నామినేటెడ్‌ పదవి ఏడాది ముందుగానే పోయిందని గిలగిలాడిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. కోర్టులకు వెళ్లి మరీ తెచ్చుకున్నారు. ఇందుకు ప్రభుత్వ ఖాజానా నుంచి తన లాయర్లకు ఫీజులు చెల్లించారు. నామినేటెడ్‌ పదవిపోతేనే ఇంత బాధపడిన నిమ్మగడ్డ.. ఓ ఉద్యోగిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తే.. అతను, అతని కుటుంబం పరిస్థితి ఏమిటో ఒక్క నిమిషం కూడా ఆలోచించనట్లుగా ఉంది. తన వ్యవహార శైలితో ఇప్పటికే రాజకీయ పార్టీల నుంచి, ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ.. తాజా ఉదంతంతో తన విభాగంలోని ఉద్యోగుల నుంచి వ్యతిరేకత చవిచూడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆత్రుతలో నిమ్మగడ్డ రాబోయో రోజుల్లో ఇంకా ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.