iDreamPost
android-app
ios-app

రీ నామినేషన్లు.. ఎవరి కోసం..? ఎందుకోసం..?

రీ నామినేషన్లు.. ఎవరి కోసం..? ఎందుకోసం..?

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తిరిగి ఆగిన చోట నుంచి ప్రారంభమైంది. 12 కార్పొరేషన్లు, 55 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్‌ జరగబోతోంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రేపు మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ సమయంలో బెదిరింపుల వల్ల నామినేషన్లు దాఖలు చేయలేని మళ్లీ నామినేషన్‌ అవకాశం కల్పిస్తామంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, వైఎస్సార్‌కడప జిల్లాలో 14 వార్డుల్లో అవకాశం ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి వార్తల్లో నిలిచారు.

12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు, 55 మున్సిపాలిటీల్లో 1,705 వార్డులు, 20 నగర పంచాయతీల్లో 418 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,794 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరుగుతుంటే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కేవలం 14 చోట్ల మాత్రమే బెదిరింపుల వల్ల నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి లేనట్లు కనిపించడంతోనే ఆయన తీసుకున్న నిర్ణయం సరికాదని తేలిపోయింది. తిరుపతి కార్పొరేషన్‌లో 6 డివిజన్లు, పంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులు, వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో రెండు వార్డులు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలో మూడు వార్డులకు రీ నామినేషన్‌ దాఖలుకు అవకాశం కల్పించడం వెనుక కారణాలేంటి..?

కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రమేష్‌కుమార్‌ చేసిన ఈ ప్రయత్నం ఎవరి కోసం..? ఎందుకోసం..? అనే ప్రశ్నలు అందరి మదిలో రేకెత్తుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో బెదిరింపుల వల్ల తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదని ప్రతిపక్ష టీడీపీ ఆది నుంచి ఆరోపిస్తోంది. అందుకే ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నోటిపికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీడియా ముందు ఈ విషయం పలుమార్లు చెప్పారు. ఆ పార్టీ నేతలు నిమ్మగడ్డను కలసి వినతిపత్రాలు అందించారు. ఇది ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి జరుగుతున్న తంతు. గత మార్చిలో అర్థంతరంగా ఏకపక్షంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన పదవినే పోగొట్టుకున్నారు. మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించి తెచ్చుకున్నారు. ఈ ప్రక్రియలో నిమ్మగడ్డకు అన్ని విధాలుగా అండదండలు టీడీపీ నుంచి అందాయన్నది బహిరంగ రహస్యం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో నిమ్మగడ్డ ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశమైన దృష్యాలు బయటకువచ్చిన విషయం ఇక్కడ గమనించాల్సిన అంశం.

మళ్లీ తనకు కమిషనర్‌పదవి దక్కేందుకు అండదండలు అందించిన వారిని సంతృప్తి పరిచేందుకు, అదే సమయంలో తాను అధికారం చెలాయించేందుకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రీ నామినేషన్ల వ్యవహారంపై నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. అందుకే సీఎం సొంత జిల్లాలో ఐదు చోట్ల, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లాలో 9 చోట్ల రీ నామినేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు తీసుకుని, కలెక్టర్లు పరిశీలించి నిగ్గు తేల్చినవి 2,794 వార్డుల్లో కేవలం 14. రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తామని చెప్పాము కాబట్టి.. ఏదో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 14 స్థానాలు ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఈ గణాంకాలతో నామినేషన్ల వ్యవహారంపై టీడీపీ చేసిన ఆరోపణలు, నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరికాదని స్పష్టమవుతోంది.

గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ లో 31 వార్డులు ఏక్రగీవమయ్యాయి. ఇక్కడ అధికార పార్టీ నేతల బెదిరింపుల వల్ల నామినేషన్లు దాఖలు పరిస్థితి లేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చే శారు. కానీ ఇక్కడ రీ నామినేషన్‌ దాఖలుకు ఒక్క వార్డును కూడా ఎన్నికల కమిషన్‌ ఎంపికచేయకపోవడంతో చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది.