స్థానిక సంస్థల ఎన్నికలపై నూతన ఎస్ఈసీ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై నూతన ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా మార్చి 15వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఆ గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించిన నూతన కమిషనర్ వి.కనగరాజ్ ఎన్నికలను మరోమారు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి నిర్ణీత గడువు విధించక పోవడం గమనార్హం.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుంచి ప్రారంభమవుతుందని కనగరాజ్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపిటిసి, జెడ్పిటిసి నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, స్కూటీని ప్రక్రియ పూర్తయింది. పురపాలక నగరపాలక సంస్థ ఎన్నికలు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ, స్కూటీని, పోలింగ్ జరగాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎన్నికల ప్రక్రియ తిరిగి మొదలైనప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా, పురపాలక, నగరపాలక ఎన్నికల కు నామినేషన్ల ఉపసంహరణ స్కూటీని నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది.

Show comments