iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్‌ ఏపీ కేడర్‌కు చెందిన ఆమెను కేంద్ర సర్వీసుల నుంచి ఇటీవలే రిలీవ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ తర్వాత సీసీఎల్‌ఏ ముఖ్యకార్యదర్శి నీరబ్‌కుమార్‌కు సీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా నీలం సాహ్ని నియామకంతో సీఎస్‌ బాధ్యతల నుంచి ఆయన్ను రిలీవ్‌ చేశారు. 

ఇప్పటి వరకు కేంద్రంలో  నీలం సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లి గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత ఏపీఐడీసీ వీసీ అండ్‌ ఎండీగా ఉన్నారు. అనంతరం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.

 ఈ బదిలీకి ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ కార్యదర్శి అయిన ప్రవీణ్ ప్రకాష్ తో విభేదాల కారణంగానే సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ చోటు చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే దీనితోపాటు దేవాలయ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచే విషయాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యతిరేకించారు. ఆ నిర్ణయానికి అనుకూలంగా లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. వైస్సార్ అవార్డుల విషయంలో ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరించిన తీరువల్ల ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రవీణ్ ప్రకాష్ కు తనకున్న అధికార పరిధిలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తదనంతరమే ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ చోటు చేసుకుంది.