iDreamPost
android-app
ios-app

ఇష్టం లేకపోతే రాష్ట్రం నుండి వెళ్లిపోవచ్చు..

ఇష్టం లేకపోతే రాష్ట్రం నుండి వెళ్లిపోవచ్చు..

ప్రయివేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ విద్యాసంస్థలను నిర్వహించలేక పొతే నిర్మొహమాటంగా రాష్ట్రంనుండి వెళ్లిపోవచ్చని ప్రయివేట్ కళాశాలల యజమాన్యాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. బుధవారం విజయవాడలో రాష్ట్ర మంత్రి ముఖ్య అతిధిగా ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలనుద్దేశించి ప్రసంగించిన మంత్రి సురేష్, రాష్ట్రంలో విద్యావ్యవస్థని శాసించాలనుకుంటే తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

రాష్ట్రంలో కొన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు అకాడామిక్ బోధనలకు అనుమతులు తీసుకొని పోటీ పరీక్షలకు బోధించడాన్ని ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనగా పరిగణమిస్తామని ఆయన తెలిపారు. ఎంత పెద్ద విద్యా సంస్థ అయినా ప్రభుత్వ నిర్ణయాలను, మార్గదార్శకాలను, చట్టాలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ప్రయివేట్ పాఠశాలలు, కాళాశాలలపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఫీజుల పేరుతొ సామాన్య ప్రజలను ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేస్తున్న తనిఖీలను కొందరు దాడులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి కళాశాల విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల వివరాలన్నీ స్పష్టంగా ప్రదర్శించాలని మంత్రి ప్రయివేట్ కళాశాలల యాజమాన్యానికి సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం సాకేంతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, దానిలో భాగంగా ఆన్ లైన్ ద్వారా ఇంటర్మీడియట్ ప్రవేశాలను చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. పెద్ద పెద్ద కళాశాలలు విద్యని సామాజిక బాధ్యత గా సవీకరించి బడుగు బలహీన వర్గాలకు, పేదలకు 25% సీట్లు కేటాయించే ఆలోచన చెయ్యాలని మంత్రి ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు.