iDreamPost
iDreamPost
రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి దాన్ని కట్టడి చేసేందుకు.. అదే సమయంలో ప్రజా జీవనానికి, ఆర్థిక పరిస్థితికి సాధ్యమైనంత వరకు ఇబ్బంది కలిగించని విదంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. రోజువారీ పరిస్థితిని సమీక్షిస్తూ ఆంక్షలు పెంచుకుంటూ వస్తోంది. తాజాగా పగటి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో కోవిడ్ పై జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. బుధవారం నుంచి పగటి కర్ఫ్యూ కూడా అమల్లోకి వస్తుంది. రోజూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు సాధారణ జనజీవనానికి, షాపులకు అనుమతి ఉంటుంది. 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తారు. 144 సెక్షన్ విధిస్తారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఈ నెల ఐదో తేదీ నుంచి రెండు వారాలు ఇవి అమల్లో ఉంటాయి.
చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి లాక్ డౌన్
దేశంలో చాలా రాష్ట్రాలు కోవిడ్ తీవ్రత కారణంగా ఇప్పటికే పూర్తి లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లో రోజూ అరవై డబ్భై వేల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు సరిహద్దులు మూసేసి.. పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి చాలావరకు అదుపులోనే ఉంది. 20వేల స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కట్టడికి ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం..అవసరాన్ని బట్టి ఆస్పత్రుల్లో పడకలు, క్వరెంటైన్ కేంద్రాలు పెంచుతోంది. అదనపు సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టారు. ఎక్కడా లేనివిధంగా ప్రతి రోజు లక్ష వరకు నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. రెం డెసివర్, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా మంత్రుల కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ చర్యల వల్ల మిగతా రాష్ట్రాల మాదిరిగా ఏపీలో పరిస్థితి చేయిదాటిపోలేదు.
ఆ పరిస్థితి రాకూడదనే కట్టడి
మిగతా రాష్ట్రాల్లో ఉన్న భయానక పరిస్థితులు మన రాష్ట్రంలో తలెట్టకూడదన్న ఉద్దేశంతోనే కేసులను సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు వాయిదా వేసి జూనియర్ కళాశాలలకు సెలవులు ఇచ్చేశారు. పాఠశాలలకు ఇంతకు ముందే సెలవులిచ్చారు. కాగా స్థానికంగా ఉన్న కేసులు, కోవిడ్ పరిస్థితుల ఆధారంగా జిల్లాల్లో పలు పట్టణాలు, నగరాల్లో అధికారులు ఇప్పటికే మినీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, చిత్తూరు తదితర జిల్లాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు సర్వం మూతపడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్తక సంఘాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వారాంతంలో ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ అమల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పగటి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.