Idream media
Idream media
తాను చెప్పిందే వేదం, ఆదేశించింది జరగాలనే ధోరణిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. పరిధి దాటి వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు బ్రేక్‌లు వేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, మీడియాతోనూ మాట్లాడకూడదని ఏపీ ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేయగా.. సింగిల్ బెంచ్ నిమ్మగడ్డ నిర్ణయాల్లో మొదటిదాన్ని తప్పుబట్టింది. బయటకు రావచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే మీడియాతో మాట్లాడకూడదన్న ఎస్‌ఈసీ ఆదేశాలను సమర్థించింది.
సింగిల్ బెంచ్ తీర్పును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేయగా నిన్న మంగళవారం విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు పూర్తవగా.. తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. సదరు తీర్పును డివిజనల్ బెంచ్ కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. నిమ్మగడ్డ తీరును తప్పుబట్టిన ఏపీ హైకోర్టు.. పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడొచ్చని ఆదేశాలు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎకగ్రీవాలు ఎక్కువగా జరిగాయంటూ.. వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై స్పందించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మగడ్డ తీరుపై ఫైర్ అయ్యారు. ఆర్‌వోలకు ఉన్న అధికారాలను గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతో.. చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని అధికారులకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21వ తేదీన ఎన్నికలు పూర్తయ్యే వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంట్లోనే ఉంచాలని, మీడియాతో మాట్లాడనీయొద్దంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అధికారం ఎస్‌ఈసీకి లేకపోయినా చెలాయించిన నిమ్మగడ్డకు తాజాగా వెలువడిన హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిమ్మగడ్డ తెచ్చిన ఈ వాచ్ యాప్‌కు హైకోర్టులో బ్రేక్ పడిన నేపథ్యంలో.. యాప్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.