iDreamPost
android-app
ios-app

ఏపీ హైకోర్ట్ చీఫ్‌ జస్టిస్ బదిలీ..?

  • Published Dec 15, 2020 | 1:05 PM Updated Updated Dec 15, 2020 | 1:05 PM
ఏపీ హైకోర్ట్ చీఫ్‌ జస్టిస్ బదిలీ..?

ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జిత్రేంద్ర కుమార్ మహేశ్వరి బదిలీ అవ్వబోతున్నారనే ప్రచారం మీడియా లో జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో వరుసగా ఏపీ హైకోర్టు వెలువరిస్తున్న తీర్పులు , రొటేషన్ వ్యవహారాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో సీజే బదిలీ అవ్వబోతున్నారనే ప్రచారం చర్చనీయాంశం అవుతోంది.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి ని నియమిస్తారని కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. ఆయన స్థానంలో జేకే మహేశ్వరిని సిక్కిం కోర్టుకి బదిలీ అవుతారని చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ నియమితులవుతారని, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న చౌహాన్ ఉత్తరాఖండ్ కు బదిలీ అవుతారని ప్రచారం సాగుతోంది. సోమవారం సుప్రీం కోర్టు కొలీజియం భేటీ అవడంతో ఈ ప్రచారాలు మొదలయ్యాయి.

పలు రాష్ట్రాల్లో బదిలీలు జరగొచ్చని మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది. ఐతే ఏపీ వ్యవహారం మాత్రం ఆసక్తికరంగానే భావించవచ్చు. జేకే మహేశ్వరి ఏడాది క్రితం అక్టోబర్ 8న హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్ కి చెందిన ఆయన ఆ రాష్ట్రంలోని హైకోర్ట్ జడ్జిగా పనిచేస్తూ ఏపీకి బదిలీపై వచ్చారు. ఆ తర్వాత ఇక్కడే చీఫ్‌ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తీరు మీద ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కీలక అంశాలలో ప్రభుత్వ పనితీరుకి అడ్డుపడేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అన్నింటికీ మించి గ్యాగ్ ఆర్డర్ విడుదలయిన తీరు మీద జాతీయ స్థాయిలోనే విమర్శలు వచ్చాయి. వాటిని ఇటీవల సుప్రీంకోర్ట్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో జేకే మహేశ్వరి బదిలీ ఐతే రాజకీయంగానూ ఈ అంశం కీలక పరిణామాలకు దారితీయవచ్చని భావిస్తున్నారు. జేకే మహేశ్వరి ని తెలంగాణా హైకోర్టుకి తీసుకెళ్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.