Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం సుప్రిం కోర్టుకు చేరబోతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సదురు స్టేను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించగా.. ఇరు వైపు వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దానిని ఈ రోజు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను డివిజనల్ బెంచ్ ఎత్తివేసింది. ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం, మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాల్సిన పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచీ చెబుతోంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వద్దకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారుల బృందం వెళ్లి వివరణ కూడా ఇచ్చింది. అయితే ఇవేమీ పట్టించుకోని నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఈ నెల 8వ తేదీన కార్యచరణ ప్రకటించారు.
కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడం సాధ్యం కాదని, ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇరు వైపు వాదనలను విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌పై స్టే ఇచ్చింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా.. షెడ్యూల్ విడుదల చేయడంలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరించిన తీరును ఆక్షేపించింది. ఇప్పుడు హైకోర్టు డివిజనల్ బెంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించబోతోంది. ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాదనను సుప్రిం బలపరుస్తుందా..? లేదా ప్రజా ఆరోగ్యం, కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఇప్పుడు నిర్వహణ సాధ్యం కాదంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాదనను సమర్థిస్తుందా..? మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.
కాగా, హైకోర్టు తీర్పు అనంతరం ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ ఓ ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. త్వరలో సీఎం, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతున్నట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే.. ఈ నెల 23వ తేదీన తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ విడుదల కానుంది.
Read Also : హైకోర్టు తీర్పును ఆర్‌కే ఓన్ చేసుకుంటారా..?