Idream media
Idream media
ఈఎస్‌ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. ఈ స్కాంలో ఏసీబీ తనను అరెస్ట్ చేస్తుందన్న అంచనాతో పితాని వెంకట సురేష్, పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గత గురువారం ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆ తీర్పును హైకోర్టు ఈ రోజు వెల్లడించింది. పితాని వెంకట సురేష్, మురళీలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఫలితంగా అరెస్ట్ నుంచి తప్పించుకుందామని భావించిన పితాని కుమారుడుకు జైలు జీవితం తప్పేలా లేదు.
ఈ స్కాంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పితాని కుమారుడు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. గత శుక్రవారం పితాని కుమారుడు, ఆయన మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం ఏపీ సచివాలయంలో ప్రస్తుతం మున్సిపల్ సెక్షన్‌లో పని చేస్తున్న మురళీని ఏసీబీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. అదే క్రమంలో పితాని కుమారుడు వెంకట సురేష్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పితాని కుమారుడును పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కోసం గాలింపు వేగవంతం చేశారు. గత శనివారం అతను హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఏసీబీ బృందం ఒకటి హైదరాబాద్‌కు వెళ్లింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వస్తుందని, అప్పటి వరకూ ఏసీబీకి దొరకకుండా ఉండాలనే వ్యూహంతో ఉన్న పితాని కుమారుడుకు తాజా తీర్పు చెంపపెట్టులాంటిదేనని చెప్పవచ్చు. ఇక ఆయన ఏసీబీకి దొరికిపోవడమో, లేదా లొంగిపోవడమో చేయకతప్పని పరిస్థితి నెలకొంది.
కాగా, తన కుమారుడు పాత్రపై స్పందించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పైరవీలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. అయితే ఏపీ ప్రభుత్వం తమపై కక్షతోనే తన కుమారుడును ఈ స్కాంలో ఇరికిస్తోందని ఆరోపించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం కూడా తప్పుకాదంటూ చెప్పుకొచ్చారు. తాజాగా హైకోర్టు తన కుమారుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఈ మాజీ మంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.