iDreamPost
android-app
ios-app

రేషన్, పింఛన్‌ పంపిణీ ఎలా..? హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ ఎలా స్పందించబోతున్నారు..?

రేషన్, పింఛన్‌ పంపిణీ ఎలా..? హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ ఎలా స్పందించబోతున్నారు..?

ఫిబ్రవరి నెల రేషన్, పింఛన్‌ సకాలంలో అందడంపై ఇంకా సందిగ్థత నెలకొనే ఉంది. రేషన్‌ డోర్‌డెలివెరీ విధానం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా.. పట్టించుకోని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఎన్నికల కోడ్‌ను కారణంగా చూపుతూ పథకం అమలును గ్రామీణ ప్రాంతాల్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చుని పేర్కొన్నారు. రేషన్‌ డోర్‌ డెలివెరీ విధానం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అమలు జరుగుతుండగా.. కరోనా, ఇతర కారణాలతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇతర జిల్లాలో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేసేందుకు వీలుగా బియ్యం రవాణా చేసే వాహనాలను ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన పంపిణీ చేసింది.

ఏడు రోజులు ఎదురుచూడాల్సిందేనా..?

నిమ్మగడ్డ వేసిన కొర్రీతో పథకం అమలు వ్యవహారం సదిగ్థంలో పడింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికల నిబంధనలకు లోబడే పథకాలు అమలు జరగాలని చెప్పిన ఏపీ హైకోర్టు.. రేషన్‌ డోర్‌ డెలివెరీ కార్యక్రమం వివరాలతో రెండు రోజుల్లోగా ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర వివరాలు అందిన తర్వాత ఐదు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పథకం అమలు ప్రస్తుతానికి త్రిశంకుస్వర్గంలో ఉన్నట్లైంది. వివరాలు అందించేందుకు రెండు రోజులు, ఆ తర్వాత ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునేందుకు ఐదు రోజులు.. వెరసి ఏడు రోజుల తర్వాతనే రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం అమలుపై స్పష్టత రానుంది. అంటే ఫిబ్రవరి 7వ తేదీ తర్వాతనే కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్‌ సరుకులు పంపిణీ జరుగుతుండగా.. వచ్చే నెల ఎలా జరుగుతుందనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఫించన్‌ పంపిణీ కూడా..

రేషన్‌తోపాటు పింఛన్‌ పంపిణీపై కూడా సందిగ్థత నెలకొంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలే దీనికి కారణం. వలంటీర్ల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు కూడా వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఈసీ చెప్పడంతో.. ఇతర సేవలకు ఆటంకం ఏర్పడింది. వలంటీర్ల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీనే ఈ తంతును వలంటీర్లు పూర్తి చేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఫోన్‌లో బయోమెట్రిక్‌ తీసుకుని పింఛన్‌ నగదు అందజేస్తున్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్లు తిరిగి ఇచ్చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలతో.. రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్‌ పింపిణీ జరుగుతుందా..? లేదా..? సందేహాలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60.19 లక్షల మందికి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు ఇస్తోంది.