iDreamPost
android-app
ios-app

తండ్రిని మించిన తనయుడు

తండ్రిని మించిన తనయుడు

రాజకీయ, అధికార వర్గాల్లో ఎన్‌టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిల వ్యక్తిత్వంపై తరచూ ఓ చర్చ జరుగుతుండేది. ఎన్‌టీ రామారావు వద్దకు వెళ్లి ఒక రూపాయి అడిగితే.. ఎక్కడ ఉన్నాయ్, అంటూ ఉన్నది ఉన్నట్లు మొహం మీదనే చెప్పేవారట. అదే వైఎస్‌ వద్దకు వెళ్లి.. రూపాయి అడిగితే.. రూపాయి లేదు. ఇదీ పరిస్థితి. ఈసారికి ఈ పావలాతో సరిపెట్టుకోండని చెప్పేవారట. ఆంధ్రప్రదేశ్‌ చర్రితలో గుర్తుండిపోయే ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారశైలి ఇలా ఉండేదట.

ఎన్‌టీ రామారావు తన వద్దకు వచ్చిన వారిని ఉత్తచేతులతో పంపితే.. వైఎస్‌ మాత్రం అడిగిన మొత్తం కాకపోయినా ఎంతో కొంత ఇచ్చి పంపేవారు. అయితే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం తండ్రిని మించిన తనయుడుగా పేరు పొందుతున్నారు. ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అడిగిందే తడవుగా చేయదగిన పనులను ఏ మాత్రం ఆలస్యం లేకుండా చేస్తున్నారు. నూతనంగా మరో నాలుగు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటుకు జగన్‌ సర్కార్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయడమే.. ఆయన వ్యవహార శైలికి నిదర్శనంగా నిలుస్తోంది.

వికేంద్రీకరణ వల్లే ప్రజా సమస్యలు సంపూర్ణంగా తెలుస్తాయని, వేగంగా పరిష్కారం అవుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ బలంగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణతోపాటు.. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 52 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్‌ సర్కార్‌ కొత్తగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరో నాలుగు కార్పొరేషన్ల ఏర్పాటుకు సిద్ధమైంది. గౌడ, బెస్త, అగ్నికుల క్షత్రియ, నాగవంశీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలో వీటి ఏర్పాటుకు సీఎం జగన్‌ ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో మొత్తం బీసీ కార్పొరేషన్ల సంఖ్య 56కు చేరనున్నాయి.

ఈ కార్పొరేషన్ల నుంచి ఆయా కులాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించనున్నారు. పథకాల అమలు తీరును కూడా కార్పొరేషన్‌ పాలక మండళ్లు పర్యవేక్షించనున్నాయి. ప్రతి కార్పొరేషన్‌కు ఒక చైర్మన్‌తోపాటు 7 నుంచి 11 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. త్వరలో బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్ల నియామకం జరగనుంది.