iDreamPost
android-app
ios-app

రొయ్యకు సాయం

రొయ్యకు సాయం

కరోనా వైరస్‌ ప్రభావం వ్యావసాయ అనుబంధ రంగాలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పౌల్ట్రి రంగం కుదేలవగా వ్యాపారులు తీవ్ర నష్టాలపాలయ్యారు. కేజీ చికెన్‌ రిటైల్‌ మార్కెట్‌లో 30 రూపాయలకు కూడా విక్రయించారు. పలు ప్రాంతాల్లో ఫారాల్లోనే కొళ్లను ఉచితంగా ఇచ్చేశారు. ఈ ప్రభావం ఇతర అనుబంధ రంగాలపై పడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

ఏపీలో ఆక్వా పరిశ్రమ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధానమైనది. సముద్రతీర ప్రాంతంలోని 9 జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువు, దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో చేపల చెరువులను రైతులు సాగు చేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నుంచి మే నెలల్లోనే ఆక్వాకు ప్రధానమైన సీజన్‌. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

ఈ రోజు అధికారులు, ఆక్వా ఎక్సైపోర్ట్‌ ఏజెన్సీలతో సమావేశమైన సంబంధిత మంత్రి మోపిదేవి వెంకటరమణ.. వారి సూచనలు, సలహాలు, అనుమతి తర్వాత ధరలు నిర్ణయించారు. 30 కౌంట్‌ ధర 430 రూపాయలు, 40 కౌంట్‌ 310, 50 కౌంట్‌ 260, 60 కౌంట్‌ 240, 70 కౌంట్‌ 220, 80 కౌంట్‌ 200, 90 కౌంట్‌ 190, 100 కౌంట్‌ ధర 180 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరకు వ్యాపారులు రోయ్యలను కొనుగోలు చేస్తారని మంత్రి మోపీదేవి చెప్పారు.

ఆక్వా సాగులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రొయ్యలు, చేపల్లో 90 శాతం ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూరప్‌ దేశాలు, అమెరికా, చైనా తదితర దేశాలకు మన రొయ్యలు ఎగుమతవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే రంగల్లో ఆక్వా ప్రధమ స్థానంలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ వల్ల ఆక్వా సాగు దెబ్బతింటే రైతులతోపాటు దేశానికి తీవ్ర స్థాయిలో నష్టం వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అందుకే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.