Idream media
Idream media
స్నేహానికి, తన అనుకునేవారికి సీఎం వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోసారి నిరూపితమైంది. తన స్నేహితుడు, సమర్థవంతమైన నేతగా పేరొందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ అపూర్వ నివాళి అర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా నెల్లూరు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురై అస్తమించారు. గౌతమ్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న సీఎం వైఎస్‌జగన్.. గౌతమ్ రెడ్డి ప్రజల మనస్సుల్లో నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెడతామని చెప్పారు. ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ ఆ విషయం గుర్తుచేశారు. తాజాగా చెప్పిన మాటను అమలుచేస్తూ గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయంగానే గాక, వ్యక్తిగతంగానూ గౌతమ్ రెడ్డితో సీఎం జగన్‌కు అత్మీయబంధం ఉంది. పాఠశాల దశ నుంచి వారిద్దరూ స్నేహితులు. గౌతమ్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం జగన్.. ఇటీవల పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.
వైసీపీ సీనియర్‌నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ రెడ్డి తొలిసారి 2014లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. రెండో దఫా ఆత్మకూరు నుంచి 2019లో శాసనసభకు ఎన్నికైన గౌతమ్ రెడ్డికి.. సీఎం వైఎస్ జగన్ తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో ఐటీ, పరిశ్రమల శాఖలు అప్పగించారు. వివాదాలకు, మీడియాకు దూరంగా ఉంటూ.. మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించడంలో గౌతమ్ రెడ్డి తనదైన ముద్ర వేశారు.