Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఆలయాలలో చోటుచేసుకుంటున్న ఘటనల పై సిఐడి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎవరైనా అందుకు ప్రయత్నించినా తక్షణమే చర్యలు తీసుకోనుంది. ఇందుకు ఎన్ని కోట్లు అయినా వెచ్చించెందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. దీనికి తోడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవదాయ శాఖ ఆధీనంలోని అన్ని ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దాదాపు అన్ని ఆలయాల్లో ఈ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఇప్పటికే 20 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి కూడా.
శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్థం ఆలయానికి కూడీ సీసీ కెమెరాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ సౌకర్యం లేకపోతే.. అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టాలనే ఉద్దేశంతో కొండపైకి ప్రభుత్వం కొత్త విద్యుత్ లైన్లు వేసింది. ఒక్క రోజులో కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఆ మర్నాడే దుర్ఘటన జరిగింది. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలకు పూనుకుంది. రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరాంనగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయం కూడా దేవాదాయ శాఖ ఆదీనంలో లేని ఒక ప్రైవేట్ ఆలయం. ఇది టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ అజమాయిషీలో ఉండటం గమనార్హం.
జియో ట్యాగింగ్..
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రత చర్యలను పర్యవేక్షించాలని ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్ఠమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి ఒక్క దేవాలయాలన్ని జియో ట్యాగింగ్ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని పోలీసులకు లేదా డైల్ 100కు సమాచారం ఇవ్వాలి, ఎల్లవేళలా పోలీసుశాఖ అందుబాటులో ఉంటుందని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోంది…
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉనికి కోల్పోతామన్న భయంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. ఆమె గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అశాంతి సృష్టించేందుకు ప్రతిపక్షం చేస్తున్న పనులు దురదృష్టకరమన్నారు.‘‘ఇంత పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నది ఒక్క జగన్ ప్రభుత్వమే. గుడిసెలు లేని రాష్ట్రం కావాలన్నదే మహానేత దివంగత వైఎస్సార్ ఆలోచన. పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ దేశంలో చరిత్రగా నిలిచిపోతుంది. ప్రతి మహిళను లక్షాధికారి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆయన గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని’’ సుచరిత పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు.. కులమతాల పేరుతో గొడవ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని మోపిదేవి విమర్శించారు.