iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ ప్రయత్నాలకు బ్రేక్‌.. ఏపీ సీఎస్‌ లేఖ

నిమ్మగడ్డ ప్రయత్నాలకు బ్రేక్‌.. ఏపీ సీఎస్‌ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందకు యత్నిస్తున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)కి లేఖ రాశారు. బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని కూడా ఆ లేఖలో కోరారు. ఈ అంశంపై స్పందించిన సీఎస్‌ నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గతంలో ప్రభుత్వం చెప్పిన విషయాన్నే పునరుద్ఘాటించారు. ఈ మేరకు రెండు పేజీలతో కూడిన లేఖను ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు పంపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని నీలం సాహ్ని తేల్చి చెప్పారు. శీతాకాల సమయంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుదనే హెచ్చరికలు ఉన్నాయని తెలిపారు. అధికారులు, పోలీసులు కరోనా వైరస్‌ నియంత్రణ విధుల్లో ఉన్నారని వివరించారు. వైరస్‌ వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 6,890 మందిని కోల్పోయామని, ఇంకా ప్రాణ నష్టం భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.

ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడు ప్రభుత్వం తెలియజేస్తుందని సీఎస్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చలేమన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కలెక్టర్లలో వీడియో కన్ఫరెన్స్‌ నిర్వహణ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని వివరించారు.