Idream media
Idream media
 
        
కరోనా వైరస్ కారణంగా గత ఏడాది విద్యా సంవత్సరం ముగింపు సమయంలో రాష్ట్రంలో మూతపడిన విద్యాలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యా సంవత్సరం వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలతో పాఠశాలలు, కళాశాలలను తెరవాలని నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, వైరస్ వ్యాపించకుండా ముందు జాగత్త్ర చర్యలు తీసుకోనున్నారు. కోవిడ్ కేసులు ఇంకా నమోదువుతున్న తరుణంలో రొటేషన్ విధానంలో తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ముందు యువతను విద్యాలయాలకు పంపాలని నిర్ణయించింది.
నవంబర్ 2వ తేదీన రాష్ట్రంలో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రొటేషన్ విధానంలో రూపొందించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 2వ తేదీన 9, 10 తరగతుల వారికి, ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం విద్యార్థులకు రొటేషన్ విధానంలో తరగతులు ప్రారంభించనున్నారు. అదే రోజు ఉన్నత విద్యా సంస్థల కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నవంబర్ 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతుల వారికి తరగతులు ప్రారంభించాలి. డిసెంబర్ 14వ తేదీ నుంచి 1, 2, 3 , 4 , 5 తరగతులను ప్రారంభిస్తారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ అన్ని తరగతుల వారికి రోజు విడిచి రోజు తరగతులు మధ్యాహ్నం వరకూ మాత్రమే నిర్వహించనున్నారు.
