iDreamPost
android-app
ios-app

కరోనా పై సమరానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు

కరోనా పై సమరానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రతిరోజు వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేసే లక్ష్యంతో కొత్త ల్యాబ్లు ఏర్పాటు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైరాలజీ ల్యాబ్ మాత్రమే ఉంది. తిరుపతి రిమ్స్ ఆస్పత్రిలో ఉన్న వైరాలజీ ల్యాబ్ కు అదనంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు మరో ఆరు కొత్త ల్యాబ్ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో రాష్ట్రంలో ప్రతి రోజూ 1,170 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

వీలైనంత ఎక్కువగా వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుపతి రుయా, కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ల్యాబులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ల్యాబుల్లో రోజుకి 180 శాంపిల్స్ చొప్పున పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మరో పది రోజుల్లో ఈ రెండు ల్యాబులు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రాష్ట్రంలో రోజుకి 1530 శాంపిల్స్ ను పరీక్ష చేసే అవకాశం ఉంటుంది. కర్నూలులో కరోనా అనుమానిత లక్షణాలు గల వ్యక్తులకు పరీక్షలు చేసేందుకు సదరు శాంపిల్స్ ను తిరుపతికి లేదా అనంతపురానికి తరలిస్తున్నారు. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే స్థానికంగానే పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న శుక్రవారం ఒక్కరోజే 18 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 381 కి చేరింది. కొత్తగా నమోదైన 18 కేసుల్లో గుంటూరు జిల్లాలో 7, ఈస్ట్ గోదావరి లో 5, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాలో రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి. ఓవైపు కొత్త కేసులు నమోదు అవుతుండగా.. మరోవైపు లాక్ డౌన్ లాక్ గడువు ముగుస్తుండటంతో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్ష జరుపనున్నారు.