iDreamPost
android-app
ios-app

ఏపీలో చదువుల విప్లవం, ఒకేసారి 14 కొత్త డిగ్రీ కాలేజీలు ఏర్పాటుకి సన్నాహాలు

  • Published Dec 10, 2020 | 2:43 AM Updated Updated Dec 10, 2020 | 2:43 AM
ఏపీలో చదువుల విప్లవం, ఒకేసారి 14 కొత్త డిగ్రీ కాలేజీలు ఏర్పాటుకి సన్నాహాలు

ఏపీలో ప్రభుత్వ విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రాధమిక విద్యారంగంతో పాటుగా ఉన్నత, సాంకేతిక విద్య సహా అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. జగన్ ప్రభుత్వం నిర్ణయంతో మళ్లీ విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల వైపు మళ్లుతున్నారు. గడిచిన రెండేళ్లలో ఏకంగా 5లక్షల మంది వరకూ విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ఓ కొత్త రికార్డ్. ఇది ఏపీలో రివర్స్ మైగ్రేషన్ కి నిదర్శనంగా ఉంది. ఇన్నాళ్ళుగా ప్రభుత్వ బడుల్లో మాని, ప్రైవేటు స్కూళ్లకు వేల రూపాయలు వెచ్చించిన తల్లిదండ్రులకు ఇది పెద్ద ఉపశమనం.

అదే సమయంలో ఉన్నత స్థాయిలో విద్యారంగం మెరుగుపరిచే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్ మెంట్ కోసం యూనివర్సిటీ ఏర్పాటుతో పాటుగా విద్యాసంస్థలను సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఇంటర్, డిగ్రీ కళాశాలల పనితీరు మెరుగుపరిచే ప్రయత్నంలో ఉంది. ఆయా కాలేజీలలో సదుపాయాల కల్పనకు శ్రద్ధ పెడుతోంది. ప్రతీ మండలంలో కనీసం ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ అయినా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వాటి ఏర్పాటునకు రంగం సిద్దమవుతోంది. కొత్త డిగ్రీ కళాశాలలకు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. తాజాగా ఒకేసారి 14 డిగ్రీ కాలేజీలు మంజూరు చేసింది.

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు గిరిజన గురుకులాల సొసైటీ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. గురుకులాల తరహాలోనే కళాశాలలతో పాటు వసతి సదుపాయం ఉండేలా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో 7 బాలికలు, 7 బాలుర కోసం ప్రారంభించనుంది. ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.14 కోట్ల చొప్పున వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇవి పూర్తిగా సొసైటీ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. విశాఖపట్నంలో 2, శ్రీకాకుళం-2, విజయనగరం-2, తూర్పుగోదావరి-2, నెల్లూరు-2, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలో ఒక్కో కళాశాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. డిగ్రీ కోర్సుల ప్రారంభానికి యూజీసీ, విశ్వవిద్యాలయాల అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ అనుమతులు రావాలంటే నిర్దేశిత ప్రమాణాలు పాటించాల్సి ఉన్నందున ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. అయినప్పటికీ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ఆ ప్రక్రియ అంతా పూర్తి అవుతుందని భావిస్తున్నారు.

బాలికల కోసం కొత్తగా 8 గురుకుల జూనియర్‌ కళాశాలలు ప్రారంభించేందుకు కూడా సొసైటీ సన్నద్ధమవుతోంది. ఒక్కో కళాశాలలో తొలి ఏడాది 160 మంది, రెండో ఏడాది 160 మంది చొప్పున ప్రవేశాలు కల్పించేలా ప్రతిపాదనలు పంపారు. శ్రీకాకుళం జిల్లా భామిని, మొలియాపుట్టి, విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం, చింతపల్లి మండలం లోతుగెడ్డ, తూర్పుగోదావరి జిల్లా చింతూరు, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు, గుంటూరు జిల్లా బొల్లాపల్లి, నెల్లూరు జిల్లా ఓజిలిలో కొత్త కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 6 గురుకులాలను అప్‌గ్రేడ్‌ చేసి జూనియర్‌ కళాశాలలుగా మార్చనున్నారు. మల్లి(శ్రీకాకుళం), కొమరాడ(విజయనగరం), మారికవలస(విశాఖపట్నం), రేణిగుంట(చిత్తూరు), రాయచోటి(కడప), తనకల్లు(అనంతపురం)లోని గురుకులాలను ఇంటర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. దాంతో ఉన్నత విద్య మరింత అందబాటులోకి వస్తుందని, ఏపీలో చదువుల విప్లవం దిశగా ఈ పరిణామాలున్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాపడుతున్నారు. నాడు నేడు తో బడుల రూపురేఖలు మార్చేస్తూ, ఇప్పుడు ఉన్నత విద్యలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా జగన్ సర్కారు పేదల చదువులకిస్తున్న ప్రాధాన్యతను చాటిచెబుతుందని అంటున్నారు.