iDreamPost
android-app
ios-app

ఆపత్కాలం లో అర్చకులకు అండ

ఆపత్కాలం లో అర్చకులకు అండ

కష్ట, నష్టాలు వచ్చిన సమయంలో ప్రజలు దేవాలయాలకు వెళతారు. కానీ ప్రస్తుతం వచ్చిన కష్టం దైవ దర్శనం చేసుకొనే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అడుగు బయట పెడితే దేవుడి దర్శనం కాదు.. నేరుగా ఆయన వద్దకే పంపుతానని కరోనా మహమ్మారి భయపెడుతోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలే కాదు.. నిత్యావసర సరుకుల విక్రయ దుకాణాలు మినహా.. అన్ని మూతపడ్డాయి. దేవాలయాల్లో భక్తులు లేకుండానే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుని ఆశీర్వాదాలు అందించే అర్చకులే భక్తులు గా మరాల్సిన పరిస్థితి నెలకొంది.

భక్తులు రాలేని పరిస్థితి లో దేవాలయాల్లో అర్చకుల పరిస్థితి దయనీయంగా మారింది. భక్తులు ఇచ్చే కానుకల పై ఆధారపడి జీవించే అర్చకులు కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారు. దేవాదాయశాఖ లేదా ప్రభుత్వం ధూప, దీప నైవేద్యం కింది అందించే ఆర్ధిక సహాయం పొందని చిన్న దేవాలయాలల్లో దాదాపు 2,500 మంది అర్చకులు దేవుని సేవలో ఉన్నారు.

లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద అర్చకులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వారికి 5 వేల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించింది. ఆపత్కాలం లో ఈ మొత్తం వారి కుటుంబ పోషణకు ఉపయోగ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఈ మొత్తం అందించాలని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవాదాయశాఖను ఆదేశించారు. ఈ కార్యక్రమం వల్ల 1.25 కోట్ల రూపాయలు 2500 మంది పేద అర్చకులకు అందనుంది.