చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్లు కోసం చేపట్టిన ఉద్యమ సమయంలో చెలరేగిన హింస, రైలు తగలబెట్టిన ఘటనల్లో నమోదైన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంభందించి 2016 లో తుని పట్టణ పోలీస్ స్టేషన్ లో 7, తుని రురల్ పోలీస్ స్టేషన్ లో 39, రైల్వే పోలీస్ స్టేషన్ లో 5 కేసులు ఇలా మొత్తం 51 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల దహనం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి తదితర అభియోగాలపై నమోదైన కేసులే.
కాపులను బీసి లలో చేర్చాలని డిమాండ్ చేస్తూ 2016 జనవరి 31 న ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో “కాపు ఐక్య గర్జన” పేరుతొ భారీ భహిరంగ సభని నిర్వహించారు. అయితే సభ జరుగుతున్న సమయంలోనే కొంతమంది ఆందోళనా కారులు సభాస్థలికి దగ్గరలోని రైలుపట్టాల దగ్గరికి చేరుకొని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని అడ్డుకొని నిప్పు పెట్టడం, ఆ తరువాత ఆందోళనకారులు తుని పోలీస్ స్టేషన్ పై దాడి చెయ్యడంతో ఒక్క సారిగా పరిస్థితి అదుపు తప్పి ఉద్యమం హిమసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ప్రభుత్వం అప్పట్లో పలువురి మీద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్ దుర్ఘటన లో మరణించిన సమయంలో ప్రచారం జరిగిన కొన్ని వార్తలను నమ్మి అనంతపురం, గుంటూరు జిల్లాల్లో కొంతమంది భావోద్వేగంతో రిలయన్స్ దుకాణాలు, రిలయన్స్ పెట్రోల్ బ్యాంకులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నమోదయిన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.