iDreamPost
android-app
ios-app

కరోనా మృతుల అంత్యక్రియలకు ఆర్థిక సహాయం.. సీఎం జగన్‌ నిర్ణయం

కరోనా మృతుల అంత్యక్రియలకు ఆర్థిక సహాయం.. సీఎం జగన్‌ నిర్ణయం

కరోనా నియంత్రణ చర్యలో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్‌ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున 15 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మొత్తం మృతుల కుటుంబానికి అందేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా వల్ల మృతి చెందిన వారి అంత్యక్రియల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న అమానవీయ ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కరోనా బాధితులకు ఉచిత చికిత్స, ఉచితంగా పౌష్టికాహారం కోసం రోజుకు 500 రూపాయలు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అంతేకాదు ఉచితంగా పరీక్షలు, క్వారంటైన్‌లో ఉండి ఇంటికి వెళ్లే వారికి ఖర్చుల కోసం రెండు వేల రూపాయలు అందిస్తోంది. తాజాగా అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడంతో జగన్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా చికిత్సతోపాటు ఆర్థిక సహాయం చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది.

ఈ రోజు కరోనాపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో మెరుగైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వారి అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా బాధితులకు చికిత్స అందించడంలో కీలక ప్రాత పోషించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.