Idream media
Idream media
మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి.. అడ్డగోలు విమర్శలు, ఆరోపణలు చేసే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు డ్రగ్స్ వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఉదంతంపై టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ముడిపెడుతూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ అనుకూల మీడియాగా భావిస్తున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు కూడా ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు రాసింది. టీడీపీ నేతలు ఇంతటితో ఆగకుండా.. పోలీసులను ఇందులోకి లాగారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. దాని ఫలితం ఈ రోజు టీడీపీ నేతలు అందుకున్నారు.
తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలకు, ఆ వ్యాఖ్యలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌తోపాటు కింజారపు అచ్చెంనాయుడు, టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లకు డీజీపీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. అనుచిత వ్యాఖ్యలపై చింతిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డీజీపీ సవాంగ్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే చట్టప్రకారం ముందుకు వెళతానని స్పష్టం చేశారు.
కోతికి కొబ్బరి చిప్ప దొరికిన మాదిరిగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అవకాశం లేని టీడీపీ నేతలకు గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ డ్రగ్ ఉదంతం దొరికింది. విజయవాడ అడ్రస్‌తో టాల్కం పౌడర్ అంటూ ఆ డ్రగ్స్‌ను బుక్ చేయడంతో టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండానే.. ఏపీని డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని, అధికార పార్టీ నేతలు డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారంటూ ఊదరగొట్టారు.
Also Read : డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ఆరాటం ఎందుకో, ఆపార్టీ నేతల దృష్టి అటు మళ్లిందెందుకో?
అయితే చెన్నైకి చెందిన ఓ సంస్థ గోవిందరాజు పూర్ణ వైశాలి అనే మహిళ పేరుతో విజయవాడ అడ్రస్ ఆధారంగా జీఎస్టీ సర్టిఫికెట్ సంపాదించింది. దానిని ఉపయోగించి టాల్క్ పౌడర్ ముసుగులో హెరాయిన్ తరలించే యత్నం చేసింది. విజయవాడ నగరంలోని సత్యన్నారాయణ పురం గడియారం వారి స్ట్రీట్ కి చెందిన ఆ అడ్రస్ లో భవనం వైశాలి తల్లి తారకం పేరుతో ఉంది. అయితే చెన్నైలో ఉంటున్న వైశాలి భర్త మాచవరపు సుధాకర్ ఈ అడ్రస్ ని అడ్డంపెట్టుకుని గత ఏడాది ఆగష్టులో జీఎస్టీ సర్టిఫికెట్ సంపాదించారు. దాని ఆధారంతో అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు అధికారులు తేల్చారు.
విజయవాడ కమిషనర్ కూడా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేశారు. ఎన్‌ఐఏ కూడా ఈ డ్రగ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఢిల్లీకి తరలించేందుకే వీటిని తెప్పించినట్లు గుర్తించింది. గతంలోనూ ఇలాగే తరలించారని ఎన్‌ఐఏ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు.
వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆరోపణలు కొనసాగించారు. వైసీపీ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తూ.. వారిని విచారించాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు కూడా ఈ దందాలో భాగం అయ్యారంటూ ఆరోపణలు గుప్పించారు. దాని ఫలితమే తాజాగా డీజీపీ జారీ చేసిన నోటీసులు. మరి ఈ నోటీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. నోటీసులకు సమాధానం ఇస్తారా…? లేదా తమకు అలవాటైన రీతిలో కోర్టులకు వెళతారా..? వేచి చూడాలి.
Also Read : బోటు కాలిన ఘటనలో టీడీపీ నేతలకు పోలీసుల షాక్, వారం రోజుల గడువుతో నోటీసులు