iDreamPost
android-app
ios-app

ఢిల్లీకి బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌.. రాజకీయంగా ప్రాధాన్యత..

ఢిల్లీకి బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌.. రాజకీయంగా ప్రాధాన్యత..

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ సహా.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్‌ తన బృందంతో కలసి ఢిల్లీ విమానం ఎక్కారు. అంతకు ముందు సీఎం జగన్‌ పులి వెందుల నుంచి గన్నవరం చేరుకున్నారు. పులివెందులలో తన మామా డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. మామకు కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించిన సీఎం జగన్‌ అక్కడ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన సీఎం జగన్‌ మళ్లీ రోజుల వ్యవధిలోనే హస్తినకు బయలుదేరడం, అందులోనూ ప్రధాని మోదీతో భేటీ కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్‌ ఢిల్లీ పర్యటనలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన పర్యటనలో సీఎం జగన్‌ అమిత్‌ షాతో రెండు సార్లు భేటీ కావడం విశేషం. అప్పటి నుంచే ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూరుస్తూ తాజాగా సీఎం జగన్‌ ప్రధాని మోదీతో భేటీ అవుతుండడం గమనార్హం.

ప్రధానితో భేటీ తర్వాత రేపు మంగళవారం సీఎం జగన్‌ జలవనరుల శాఖ నిర్వహించే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్నారు. కృష్ణా జలాల పంపకంపై ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర వాదనలను సీఎం జగన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో వినిపించనున్నారు. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడిన ఈ సమావేశం ఎట్టకేలకు రేపు జరగబోతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఈ సమావేశంలో ఎలాంటి వాదనను వినిపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.