Idream media
Idream media
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం జగన్ నేరుగా పోలవరం వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయబోతున్నారు. పనుల పరిశీలన అనంతరం ఉదయం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకూ ప్రాజెక్టు పునుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:25 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అంచనాలు తగ్గింపు, ఎత్తు తగ్గింపు, నీటి నిల్వ అంశాలపై ఇటీవల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ ఊహాగానాలను తిప్పి కొట్టిన జగన్ ప్రభుత్వం నిర్ణీత గడువు లోపు ప్రాజెక్టును నిర్ణీత ఎత్తులో నిర్మిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 2022 ఖరీఫ్ పంటకు పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది.
ప్రచారానికి దూరంగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్.. ప్రాజెక్టు పనులను శరవేగంగా చేయిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ ప్రాజెక్టును సందర్శించడం ఇది మూడోసారి మాత్రమే కావడం ప్రచార ఆర్భాటానికి సీఎం దూరంగా ఉంటున్నారన్న విషయం స్పష్టమవుతోంది. రివర్స్ టెండర్ల ద్వారా ప్రాజెక్టు కాంట్రాక్టులలో 838.58 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వైసీపీ ప్రభుత్వం ఆదా చేసింది. రివర్స్ టెండర్లలో కాంట్రాక్టును దక్కించుకున్న మేఘా సంస్థ పనులను పరుగులుపెట్టిస్తోంది.