Idream media
Idream media
కరోనా థర్ట్ వేవ్ దేశంలో మొదలైంది. రోజు వారీగా నమోదయ్యే కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా వైరస్ వ్యాప్తి వేగం కాలేదు. రాబోయే రెండు, మూడు నెలల్లో థర్డ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రోజుకు 16 నుంచి 20 లక్షల కేసులు నమోదవుతాయనే అంచనాలున్నాయి. వెనుకో, ముందో.. కరోనాపై నిపుణుల అంచనాలు నిజమయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ సునామీని సృష్టిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో థర్ట్ వేవ్‌లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది.
ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను కొత్త ఏడాదిలో విజయవాడలో ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్.. తాజాగా 144 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాంట్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు చనిపోయారు. కోవిడ్‌తో కలిసి బతకాల్సి వస్తుందని ముందుగానే చెప్పిన సీఎం జగన్.. ఆ మేరకు వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. ఆ చర్యల ప్రతిఫలమే.. తాజాగా అందుబాటులోకి వచ్చిన 144 ఆక్సిజన్ ప్లాంట్లు.
తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా భారీ ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి కాబోతోంది. ఒక్కొక్క ప్లాంటు నిమిషానికి వెయి లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆక్సిజన్‌ను నిల్వ చేసుకునేందుకు 20 కోట్ల రూపాయల వ్యయంతో క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లను ఏపీ సర్కార్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంది. వీటితోపాటు 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులను సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,419 బెడ్లకు పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ అందించే ఏర్పాట్లును చేసుకుంది. థర్డ్ వేవ్‌లో పిల్లలపై వైరస్ ప్రభావం చూపే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో.. రాష్ట్ర వ్యాప్తంగా 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచ్‌సీ)లో చిన్న పిల్లల వార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 అత్యాధునిక ఆర్‌టీపీసీఆర్ వైరల్ ల్యాబులను ఏర్పాటు చేసుకుంది. గుంటూరు, విశాఖ, తిరుపతి నగరాల్లో మరో మూడు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయతలపెట్టింది.
వ్యాక్సిన్ తొలి డోసు పూర్తి..
ఇక వ్యాక్సినేషన్‌లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ తొలి డోసు వేసింది. దాదాపు 80 శాతం మందికి రెండో డోసు వేసింది. ఈ వారంలో ప్రారంభమైన టీనేజర్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనే ఏపీ దూసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 82 శాతం టీనేజర్లకు వ్యాక్సిన్ వేసింది. ఈ చర్యలకు అదనంగా.. ఇంటింటి సర్వే నిరంతరం చేస్తోంది. వలంటీర్లు, ఆశ కార్యకర్తలు కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 33 సార్లు ఇంటింటి సర్వే చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, ల్యాబులు అందుబాటులోకి రావడంతో.. కోవిడ్ సమయంలో ఏపీ సురక్షితమైన రాష్ట్రంగా నిలిచింది.
Also Read : జగన్ కృషి భేష్ : ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు.. ఆధునిక ల్యాబ్ లు