iDreamPost
iDreamPost
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా పాలయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఉన్న ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయమే ఆయన్ని ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కి తరలించారు. అక్కడే నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయ్యింది.
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన గవర్నర్ తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. జ్వరం కూడా వస్తోందని వైద్యులు తెలిపారు. దాంతో ఆయనకు పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు.
ఆస్పత్రిలో ఉన్న గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నేరుగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో సీఎం మాట్లాడారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మంచి వైద్యం అందించాలని, ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచించారు.
గవర్నర్ కోలుకోవాలని పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు కూడా వేర్వేరు ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
Also Read : Leander Paes – గోవా సిఎం అభ్యర్థిగా లియాండర్ పేస్ ? !