iDreamPost
iDreamPost
ప్రభుత్వ సేవల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించడానికి ‘కాల్ 14400’ హెల్ప్ లైన్, ‘ఏసీబీ 14400’ యాప్ (ACB 14400 app) లను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏసీబీ నంబర్ 14400తో పోస్టర్లు తయారు చేసి వీటిని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. 14400 నంబర్ కు వచ్చే కాల్స్, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించి పటిష్టమైన నివేదికలు తయారు చేయాలన్నారు. ఈ నంబర్ తో పాటు ‘ఏసీబీ 14400’ యాప్ పైనా విస్తృత ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి ‘ఏసీబీ 14400’ యాప్ (ACB 14400 app) డౌన్ లోడ్ (download) చేసుకుని అవినీతిపై నేరుగా ఫిర్యాదు చేసే వీలుంది. రెవెన్యూ, ఎక్సైజ్, మున్సిపల్ తదితర శాఖా మంత్రులు, అధికారులతో సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా నిర్వహించిన ముఖ్యమంత్రి YS జగన్ ఈ మేరకు సూచనలు చేశారు. ప్రభుత్వ సేవల్లో ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతి జరగడానికి ఆస్కారమున్న అన్ని ప్రభుత్వాఫీసులపై మరింత నిఘా పెట్టాలని CM సూచించారు. ఆదాయ ఆర్జనలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం పెంచాలన్నారు.
అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి YS జగన్ 2019 నవంబర్ 25న ‘కాల్ 14400’ హెల్ప్ లైన్ ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 1న ‘ఏసీబీ 14400’ యాప్ (ACB 14400 app) స్టార్ట్ చేశారు. మీరు కూడా లంచావతారులను పట్టించాలంటే పైన నంబర్ కి కాల్ చేసి గానీ యాప్ డౌన్ లోడ్ చేసుకుని కానీ ఫిర్యాదు చేయవచ్చు.