iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన పధకాల ద్వారా సామాన్య ప్రజలకు ఆర్ధిక లబ్ది చేకూరుస్తూ వారిని సోమరులను చేస్తున్నాడు. ఒక పక్క రాష్ట్రం అప్పుల్లో ఉంటే ప్రజలకి ఈ రకంగా పధకాల రూపంలో డబ్బు పంచడం రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటూ కొత్తగా నయా ఆర్ధిక వేత్తల అవతారం ఎత్తిన ప్రతిపక్ష మద్దతు దారులు పలు వేదికల పై వ్యాఖ్యానిస్తున్నారు . వీరు చేస్తున్న ఈ విమర్శల్లో ఒకటి ఆనందపడే విషయం ఉన్నా మరొకటి ఆక్షేపణీయం. గత పాలనలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేసినట్టు కాకుండా జగన్ తాను మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగానే వివిధ పధకాల రూపంలో ప్రజలకు ఆర్ధికంగా చేయూతనిస్తూ వారికి అండగా నిలబడుతున్నారని ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులైన వీరే ఒప్పుకున్నారు . అంతవరకు అభినందించాల్సిన విషయమే .
ఇక వీరు ప్రచారం చేస్తున్న ఈ మాటలల్లో ఆక్షేపనీయం ఏంటంటే ప్రజలకు జగన్ పధకాల రూపంలో డబ్బులు ఇస్తూ వారిని సోమరులని చేస్తున్నాడని, ఈ పద్దతి వలన అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి తీవ్ర నష్టం అని , ఇలా ఆరోపణలను చేస్తు తెలుగుదేశం, జనసేన మద్దతుదారులుగా ఉన్న వీరిది పేదల వ్యతిరేక ఆలోచనాధోరణి అని నిరూపించుకున్నారు. గతేడాది ఆరంభంలో మహమ్మారిలా ముంచుకొచ్చిన కరోనా ఫలితంగా విధించిన లాక్ డౌన్ మూలాన దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. దేశవ్యాప్తంగా శ్రమజీవుల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా దెబ్బతిన్నాయి, వారిలో కొనుగోలు శక్తి శూన్య స్థితికి చేరింది . దీంతో గత 45 ఏండ్లలో మునుపెన్నడూ లేనివిధంగా జీడీపీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
అయితే అనేకమంది ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలు ఈ సమస్యకు చూపుతున్న పరిష్కారం ఏంటంటే ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితి నుంచి దేశం తేరుకోవాలంటే కొనుగోలుదారుల్లో ఉద్దీపనలతో డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థను చైతన్యపర్చటమే అని, ముఖ్యంగా నోబెల్ గ్రహీత ఎస్తేర్ డఫ్లో ఈ సమస్యకు పరిష్కారంగా టీయూపీ విధానం ప్రకారం.. దేశంలోని పేదలందరికీ నేరుగా డబ్బును అందించటం ద్వారా వస్తు కొనుగోళ్లు శక్తిని పెరిగేట్లు చేయాలని చెప్పారు. మరో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ ప్రకారం.. మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థలో కదలిక తెచ్చేందుకు ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా డబ్బు అందించి కొనుగోలు శక్తి పెంచాలని అప్పుడే క్షీణించిన దేశ ఆర్ధిక పరిస్థితి తిరిగి గాడిలో పడే అవకాశం ఉందని ఒక పరిష్కార మార్గం చూపారు.
కార్ల మార్క్స్ చెప్పిన ఆర్ధిక విధానం కూడా ఇదే. దేశం ఆర్ధికంగా బలంగా ఉండాలి అంటే పెట్టుబడి దారి వ్యవస్థకు రాయతీలు ఇవ్వడం కన్న ఆ దేశ పేదలకు కొనుగోలు శక్తి పెరిగేలా చేయడం ఏకైక మార్గం గా తన సిద్దాంతంలో స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి ముంచుకు వచ్చిన వెంటనే దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7వేలు కేంద్రప్రభుత్వం అందించి వారిలో కొనుగోలు శక్తిని పెరిగేలా చేయాలని అనేకమంది ఆర్ధికవేత్తల నుంచి డిమాండ్లు వచ్చాయి .
అవి జాతీయ స్థాయిలో ఎంతవరకు నెరవేరాయి అన్నది పక్కన పెడితే , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం కరోనా మహమ్మారి కన్నా ముందు నుంచే రాష్ట్ర జీడీపీని గాడిలో పెట్టే విధంగా ఆర్ధిక వేత్తలు ప్రకటించిన ఈ విధానాన్నే అవలంభిస్తూ వచ్చారు. కార్ల మర్క్స్ చెప్పిన విధంగానే మధ్యతరగతి , దిగువ మధ్యతరగతి, నిరుపేదలను వివిధ పధకాలకు లబ్దిదారులుగా చేస్తూ వారికి నేరుగా డబ్బు అందిస్తూ తద్వారా వారిలో కొనుగోలు శక్తిని పెంచేందుకు కృషి చేశారు. అమ్మఒడి, వైయస్సార్ చేయూత, రైతు భరోసా, పించన్ , వసతి దీవెన, విద్యా దీవెన, వైయస్సార్ మత్స్యకార భరోసా , చిన్న పరిశ్రమలకు MSME రీస్టార్ట్ ప్యాకేజీ, వైయస్సార్ వాహన మిత్ర , జగన్ అన్న చేదోడు , వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ కాపు నేస్తం, జగనన్న తోడు అంటూ ఇంకా అనేక పధకాల ద్వారా పలు రంగాల ప్రజలకు లబ్ది చేకూర్చడమే కాకుండా కొత్తగా గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆరోగ్యశ్రీ అంబులెన్సులు, పౌరసరఫరాల వాహనాల వ్యవస్థల ద్వారా నిరుద్యగ యువతకు ఉద్యోగాలు కల్పించారు. గడచిన 20 నెలల కాలంలో రాష్ట్రంలో 13.51 లక్షల ఉద్యోగాలు సృష్టించి పేద మధ్యతరగతి వారిలో కొనుగోలు శక్తి పెరిగేలా చేసి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఇలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి . కాబట్టే ఆయనకు దేశంలోనే అత్యత్తుమ ముఖ్యమంత్రుల్లో 3వ స్థానం లభించింది.
“రూరల్ మీడియా” శ్యాం మొహన్ గారి అభిప్రాయం ఇలా ఉంది,
విజయనగరం నుండి 140 కిలో మీటర్ల దూరంలోని, గుమ్మలక్ష్మీపురం దాటి, సదునుగూడ చేరుకునేటప్పటకి మధ్యాహ్నం 2 దాటింది. అక్కడ 60 వరకు గడపలు ఉన్నాయి. చిన్న పిల్లలు మేకల వెంట పొలాల్లో తిరుగుతున్నారు. నరేగా ప్రాజెక్టు మీద కేస్ స్టడీ చేయాలి కానీ, ఆ రోజు మా పని అయ్యేలా లేదు. పెద్దవాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఓ గంట సేపు జీడిమామిడి తోటల్లో తిరిగి జీడిపండ్లు రుచి చూశాం. ” అందరూ పక్క ఊరు వెళ్లారంట, ఇంకో రోజు పెట్టుకుందాం..” అని మాతో వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ చెప్పడంతో వెనక్కు తిరిగాం…
ఇంతలో… తలపైన బియ్యం మూట, చంకలో చంటిబిడ్డతో ఒకామె నడచు కుంటూ గ్రామంలోకి వచ్చి నెత్తిమీద బరువును ఒక అరుగు మీద దించి, కొంగు తో చెమటలు తుడుచు కుంది .ఆమె దగ్గరకు వెళ్లి మేం వచ్చిన సంగతి చెప్పాం. ” ఈ రోజు ఎవరూ ఉండరండి … రేషన్ బియ్యం, సరుకులు ఇస్తున్నారు, ఇక్కడికి చాలా దూరం . తెచ్చుకోవడానికి వెళ్లాం. దీని వల్ల ఈ రోజు కూలీ కూడా పోయిందయ్యా… ” అని చంటి బిడ్డకు పాలివ్వ సాగింది. మూడేళ్ల క్రితం చూసిన గ్రౌండ్ రియాలిటీ ఇది.
రోజుకు కనీసం రూ. 200 కూలీ చొప్పున ఇంతకాలం,ఎన్ని లక్షల పనిదినాలను పేదలు కొల్పోతున్నారో లెక్కలు తీస్తే అది మరో కేస్‌స్డడీ అవుతుంది!!
కాబట్టి పేదోళ్లకు ఇళ్లను ఇస్తున్నారని, ఇంటికే రేషన్ సరుకులు పంపుతూ బద్దకాన్ని పెంచుతున్నారని… ఏడ్వకండి. ఆభి వృద్ధి ఆకాశం నుండి ఊడి పడదు. పేదలు స్వయం సమృద్ధి అవ్వడమే అభివృద్ది . ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక సామాజిక మార్పు మొదలైంది…
—————-
తెలుగుదేశం , జనసేన పార్టీల మద్దతుదారుల వ్యవహారం చూస్తుంటే దేశంలో వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన బడా వ్యక్తులు ఉన్నా పర్వాలేదు కానీ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే బడుగు , బలహీన వర్గాలకు నగదు అందించటం మహా అపచారం అన్నట్టు ఉంది.. జగన్ పధకాల ద్వారా నగదు పంచి సామాన్యులను సోమరులను చేయడంలేదు . వారిలో కొనుగోలు శక్తిని పెంచుతూ దేశానికి వారు ఆర్ధికంగా వెన్నుముకలా నిలబడేలా కృషి చేస్తున్నారు. ఇదే ఆర్ధిక వేత్తలు చెబుతున్న మాట … నయా ఆర్ధిక వేత్తల అవతారం ఎత్తినఈ ఇరు పార్టీల మద్దతుదార్లు నిజమైన ఆర్ధిక శాస్త్రం గురించి తెలిసుకుంటే మంచిది.