Idream media
Idream media
రాయలసీమ వాసుల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటులో భాగంగా జాయింట్ వెంచర్ ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా జాయింట్ వెంచర్‌లో భాగస్వామ్య కంపెనీగా లిబర్టీ స్టీల్ ఇండియాను ఎంపిక చే సింది. తాజాగా పరిణామంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియలో ప్రధాన ఘట్టం పూర్తయింది. ఇక ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగనున్నాయి.
25 వేల మందికి ఉపాధి..
మూడేళ్లలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో 2019 డిసెంబర్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద శంకుస్థాపన చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం హైగ్రేడ్ స్టీల్ సంస్థను ఏర్పాటు చేసింది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో హైగ్రేడ్ స్టీల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ కడప స్టీల్ ప్లాంట్‌కు ఐదు వేల టన్నుల ముడి ఇనుప ఖనిజం సర ఫరా చేయనుంది. సీమలోని ఘనుల నుంచే ముడి ఖనిజం సరఫరా జరుగనుంది. 15 వేల కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఏడాదికి 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ పని చేయనుంది. ఈ పరిశ్రము పూర్తయితే ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించనుంది.
వైఎస్ అడుగు.. జగన్‌తో పూర్తి..
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగు వేశారు. 2007లో బ్రహ్మణి స్టీల్ పేరుతో ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దాదాపు 10, 670 ఎకరాల భూమిని సేకరించారు. అయితే 2009లో వైఎస్‌ఆర్ అకాల మరణంతో ప్లాంట్ ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. 2012లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమర్‌రెడ్డి ప్లాంట్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ పైలాన్ ఆవిష్కరించారు. తన తండ్రి ఆశయాన్ని తాను నెరవేర్చతానని సీఎం వైఎస్ జగన్ ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. తాజాగా జాయింట్ వెంచర్‌లో భాగంగా భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేసి సీమ ప్రజల కలను సాకారం చేయడంలో మరో ముందడుగు వేశారు.