Idream media
Idream media
ఈ నెల 29వ తేదీన నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ఈ రోజు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.05 లక్షల మంది రైతులకు చెందిన 13.10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. వీరికి 718 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని అందించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ రోజు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఇకపై ప్రకృతి వైపరిత్యాల వల్ల పంట నష్టపోతే.. నెల రోజుల్లోనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేలా మంత్రివర్గం విధాన పరమైన నిర్ణయం తీసుకుందని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద మూడో విడత నగదును కూడా ఈ నెల 29వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కింద చివరి విడతగా ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును ప్రభుత్వం అందించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 50.47 లక్షల మంది రైతులకు 1009 కోట్ల రూపాయలు అందించనున్నారు.
ఇవీ మంత్రివర్గ నిర్ణయాలు…
– పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖలో 147 ల్యాబ్ టెక్నిషియన్స్, 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ.
– పులివెందులలో ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు.
– ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యూకేషన్ రిసెర్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం.
– 21న ప్రారంభించబోయే సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి ఆమోదం.
– చిత్తూరు జిల్లా తిరుపతి అర్భన్ మండలంలో చెన్నైగుంట గ్రామంలో సర్వే కాలేజీ ఏర్పాటుకు ఆమోదం.
– పప్పు దినుసుల, తృణధాన్యాల పరిశోధన కోసం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం చినపవని గ్రామంలో 410 ఎకరాల భూమి ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయానికి కేటాయింపు.
– ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌కు భూములు సేకరించిన ఏర్పేడు మండలం వికృతమాలలో మిగిలిన భూ యజమానులకు పరిహారం చెల్లింపు.
– కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల వద్ద 11.83 ఎకరాల భూమిని అటవీ శాఖకు ఇచ్చేందుకు ఆమోదం.
– హోటళ్లు, పంక్షన్ హాళ్లు బాగుచేసుకునేందుకు 50 వేల నుంచి 15 లక్షల వరకూ రుణసదుపాయం కల్పన. 198.50 కోట్లతో హోటల్ రిస్టాట్ ప్యాకేజీ ఏర్పాటు. ఆరు నెలల మారటోరియం విధింపు. మొదటి ఏడాది 4.5 శాతం వడ్డీ రాయితీ కల్పన.
– నూతన టూరిస్ట్ పాలసీకి ఆమోదం.
– 6 జిల్లాలో వాటర్ షెడ్ పథకం అమలుకు నిర్ణయం
– చింతలపూడి ఎత్తిపోతలకు నాబార్డు నుంచి 1039 కోట్ల రుణం తీసుకునేందుకు నిర్ణయం
– ఏపీ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషన్ నియామకం ర్యాటిఫై.
– సినీ పరిశ్రమకు రిస్టాట్ ప్యాకేజీ. థియేటర్లకు రుణ సదుపాయం. మార్చి, ఏప్రిల్, మే నెలల ఫిక్సిడ్ పవర్ ఛార్జిలు చెల్లింపులు రద్దు. మిగతా నెలల చెల్లింపులు వాయిదా.