iDreamPost
android-app
ios-app

లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌

లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌

విద్యతోనే బతుకులు మారతాయని నమ్ముతున్న జగన్‌.. ఆ దిశగా తాను అనుకున్నది చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి క్లాస్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా, విద్యార్థుల గ్రహణ శక్తికి అనుగుణంగా వారి మేథస్సుకు పదునుపెట్టేలా విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లే క్లాస్‌ నుంచి ఇంటర్‌ వరకు తరగతులను ఆరు కేటగిరిలుగా విభజిస్తూ మంత్రివర్గం తీర్మానించింది.

శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2) , ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2), ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ-1 నుంచి 5వ తరగతి వరకు), ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు), హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు), హైస్కూల్ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) గా విభజించింది.

ఈ ఏడాది నుంచి ఈబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేరవేసింది. ఇంగ్లీష్, తెలుగు భాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది విద్యార్థులకు అందబోతున్నాయి. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు మాదిరిగానే.. ప్రతి క్లాస్‌కు ఒక ప్రత్యేక తరగతి గది ఉండేలా అవసరమైన భవనాలు నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీన జగనన్న విద్యా కానుకను అందించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.

మరికొన్ని నిర్ణయాలు…

ఈ నెల 10వ తేదీన వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం మూడో విడత అమలు చేసేందుకు కేబినెట్‌ తీర్మానించింది. ఈ పథకం ద్వారా దాదాపు 4 లక్షల మంది చేనేతలకు 24 వేల రూపాయల చొప్పన లభించనున్నాయి. 20 వేల రూపాయల లోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లదారులకు నగదు చెల్లించేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని తీర్మానించింది. భావనంపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి సంబంధించి సవరించిన డీపీఆర్‌కు ఆమోదం సహా దాదాపు 40 అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

Also Read : పులిచింతల నష్టనివారణలో ఫలించిన ప్రభుత్వ చొరవ