iDreamPost
android-app
ios-app

శృతి మించితే వారిపై కూడా వేటు త‌ప్ప‌దా..?

శృతి మించితే వారిపై కూడా వేటు త‌ప్ప‌దా..?

మూడు రాజ‌ధానుల అంశం త‌మ ప‌రిధిలో లేదంటూ కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన కొంద‌రు బీజేపీ నాయ‌కులు మాత్రం.. అమ‌రావ‌తికి అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. కేంద్రం సూటిగా చెప్పిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్య‌తిరేకంగా మాట్లాడ‌డంపై పార్టీ సీరియ‌స్ అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రిని స‌స్పెండ్ చేసింది. ఇటీవల మూడు రాజధానులపై ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవీ. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా మరో నేతపై సస్పెండ్ వేటు పడింది. రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణ‌ను బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘అమరావతి రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదు. రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని పార్టీ అధికారికంగా తెలిపింది. కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అధ్యక్షుల సూచనల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ లేఖలో సోము వీర్రాజు స్పష్టం చేశారు. వీరే కాకుండా మ‌రి కొంద‌రు కూడా అమ‌రావ‌తికి అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు నేత‌ల స‌స్పెండ్ చేసిన బీజేపీ శృతి మించితే ఎవ‌రిపైనైనా క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

క‌న్నా లేఖ‌పై కూడా చ‌ర్య‌లుంటాయా…?

రాజ‌ధానుల అంశానికి సంబంధించి బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అయితే ఏకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ కూడా రాశారు. ప్రభుత్వం పంపించిన క్యాపిటల్ బిల్లులకు ఆమోదం తెలపొద్దని ఆయ‌న‌ను విజ్ఞప్తి చేసిన విష‌యం తెలిసిందే. రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం, 2014ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ.. మీ ముందుకు బిల్లును పంపించిందని… అయితే.. అది రాజ్యాంగ విరుద్ధమని లేఖలో క‌న్నా వివరించారు. వికేంద్రీకరణపై బిల్లు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కు వ్యతిరేకంగా తెలిపారు.కేంద్రం కూడా అమరావతి అభివృద్దికి నిధులు కేటాయించిందని లేఖలో వివరించారు. ఆ బిల్లులు ఆమోదించవద్దు అంటూ గవర్నర్‌కు పంపిన లేఖలో కన్నా కోరారు.

అలాగే ఏపీ రాజ‌ధానిని ఒక్క ఇంచ్ కూడా క‌ద‌ల‌నివ్వ‌బోమంటూ ఎంపీ సుజ‌నా చౌద‌రి కూడా చాలా సార్లు చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ‌కు అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు వ‌చ్చాక‌.. ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా పార్టీలో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుంన్నాయి. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ లైనులో మాట్లాడుతున్న వారిపై వేటు ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మున్ముందు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌, సుజ‌నా చౌద‌రి లాంటి వారిపై కూడా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలుంటాయా..? అని బీజేపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.