iDreamPost
android-app
ios-app

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న పార్టీలు

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న పార్టీలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులను ఈ రోజు జరిగిన సమావేశంలో మంత్రిమండలి ఆమోదించింది. పశువుల ధాణా కల్తి నివారణ చట్టం, పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు స్పెషల్‌పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను కేబినెట్‌ ఆమోదించింది. వీటిని ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది.

ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం అవుతోంది. ఈ రోజు టీడీపీ ఉప నాయకుడు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. దాదాపు 20 అంశాలపై అసెంబ్లీ చర్చించాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బకాయలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, ఇళ్ల పట్టాల్లో అవినీతి, దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులు, వర్షాలు, వరదలు, పంట నష్టం, ప్రజలపై బారాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర 20 అంశాలను చర్చకు లేవనెత్తాలని టీడీపీ నిర్ణయించింది. వీటిపై స్పల్ప కాలిక చర్చ, ప్రశ్నోత్తరాలకు పట్టుబట్టాలని నిర్ణయించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి కూడా రక్షణ ఏర్పాట్ల మధ్య సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల 30వ తేదీన ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని శాసన సభ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. శాసన సభ ప్రారంభం అయిన తర్వాత నిర్వహించే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లో సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చించి నిర్ణయించనున్నారు.