iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాలు హాటుహాటుగా మారాయి. ఎత్తుకు పై ఎత్తులతో అధికార, విపక్షాలు అడుగులు వేస్తున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులకు సంబంధించి ప్రభుత్వానికి మండలిలో ఆశాభంగం అయ్యింది. ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. దానికి చంద్రబాబు కుయుక్తులు, మండలి చైర్మన్ షరీఫ్ ఒత్తిడికి గురికావడం వంటి కారణాలే కీలకం అని పాలక వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎత్తులను చిత్తు చేసే రీతిలో చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే జగన్ అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. కీలక నేతలతో మంతనాలు నిర్వహించారు.
జగన్ సాగించిన చర్చల సారాంశం ప్రకారం శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి పాలకపక్షం వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు జగన్ ముందు ఈ ప్రతిపాదనలు తీసుకురావడంతో ఇక మండలి చరిత్ర ముగుస్తున్నట్టేనని పులువురు భావిస్తున్నారు. ఇప్పటికే గత కొద్దిరోజులుగా శాసనమండలి రద్దు చుట్టూ చర్చలు సాగుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ రద్దు చేసిన మండలిని వైఎస్సార్ హయంలో పునఃప్రారంభించిన తరుణంలో జగన్ ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఊహాగానాలు వ్యక్తమవయ్యాయి.
ఇప్పుడు అవన్నీ ఆచరణ రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా మంత్రి బొత్సా, సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వంటి వారి వ్యాఖ్యలు దానికి అనుగుణంగా ఉన్నాయి. శాసనమండలి కొసాగింపు అవసరమా అనే విషయంపై ఆలోచన అవసరం అంటూ మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. దాంతో ఇక అత్యవసర క్యాబినెట్ భేటీ జరుగుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. జగన్ కీలక నిర్ణయం తీసుకుని క్యాబినెట్ లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే వచ్చే వారం వరకూ సభను కొనసాగించాలని నిర్ణయించారు. మంగళవారం వరకూ అసెంబ్లీ ఉంటుందని చెబుతున్నారు. ఆతర్వాత కేంద్రానికి తీర్మానం పంపించడం ద్వారా మండలికి ముగింపు పలికే యోచనలో సర్కారు ఉన్నట్టు కనిపిస్తోంది.
అదే సమయంలో వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ ని కూడా సిద్దం చేస్తున్నట్టు చెబుతున్నారు. తద్వారా మండలిలో సెలక్ట్ కమిటీ పేరుతో కాలయాపనకు చంద్రబాబు ఎత్తులు వేస్తే ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తీసుకొచ్చి బాబుకి ఝలక్ ఇచ్చే యోచనలో జగన్ ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ భేటీకి సన్నద్ధమవుతున్న వేళ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.