Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకూ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ తీర్మానం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం ఆ తీర్మానంలో పేర్కొంది.
అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన గురువారం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చించిన తర్వాత అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
మార్చిలో ముమ్మరంగా జరుగుతున్న స్థానిక ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) ఆ తర్వాత అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంస్కరణలలో భాగంగా పదవిపోవడంతో కోర్టులను ఆశ్రయించి మళ్లీ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ, బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో రహస్య సమావేశాలు జరపడం చర్చనీయాంశమైంది.
కరోనా వైరస్‌పేరు చెబుతూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఇప్పుడు కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరో మూడు నెలలు.. అంటే మార్చి 31వ తేదీన ఆయన ఉద్యోగ విమరణ చేయబోతున్నారు. ఈ కారణంతోనే.. తాను పదవిలో ఉండగా ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పినా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అసెంబ్లీ చేసిన తీర్మానంతో నిమ్మగడ్డ ప్రయత్నాలకు చెక్ పడినట్లేనని భావిస్తున్నారు.