iDreamPost
android-app
ios-app

చంద్రబాబు 10 రోజుల డిమాండ్ కి సై అన్న సర్కారు

  • Published Nov 30, 2020 | 1:51 AM Updated Updated Nov 30, 2020 | 1:51 AM
చంద్రబాబు 10 రోజుల డిమాండ్ కి సై అన్న సర్కారు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు నిర్వహించాలని ప్రతిపక్షం కోరింది. మనస్ఫూర్తిగా అలా డిమాండ్ చేసిందా లేక మాట మాత్రానికేనా అన్నది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 5 రోజుల పాటు సభ జరపాలని అధికార పక్షం ప్రతిపాదించింది. దానికే ప్రతిపక్ష టీడీపీ నేతలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటిది 10 రోజుల సభకు వారు సిద్దమేనా అనే సందేహాలు రాకమానవు.

అధికార పక్షం మాత్రం తాము సిద్దమేనని ప్రకటించింది. బీఏసీలో నిర్ణయించి ఎన్ని రోజుల పాటు సభ జరపడానికైనా మాకు అభ్యంతరం లేదని తేల్చేసింది. దాంతో టీడీపీ నేతల గొంతులో వెలక్కాయపడ్డట్టయ్యింది. గత సభలో ప్రతిపక్షం పట్టుబట్టినా సమావేశాల పొడిగింపునకు ససేమీరా అన్న అనుభవం చంద్రబాబు అండ్ కో కి ఉంది. కానీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. కోవిడ్ ప్రత్యేక పరిస్థితులు లేకపోతే సభను సుదీర్ఘకాలం పాటు కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నట్టే తేల్చేసింది. దాంతో టీడీపీకి ఇది ఊహించని దెబ్బగా మారింది.

సభలో మీడియాని అడ్డుకుంటున్నారనే ప్రచారం ఒకటి ప్రారంభించింది. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలకు ప్రభుత్వం ఎటువంటి ఆటంకం పెట్టలేదు. పైగా గతంలో ఏబీఎన్ ద్వారా ప్రసారం చేసిన సమయంలో ప్రతిపక్ష కార్యక్రమాలను కవర్ చేయకుండా నిర్లక్ష్యం చేసిన రీతిలో వ్యవహరించడం లేదు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మీడియాను లాబీల్లోకి అనుమతించడం, మీడియా పాయింట్ నిర్వహించడం వంటివి సాద్యం కాదని తేల్చేసింది. దానిని కూడా మొత్తం మీడియాను అడ్డుకుంటున్నారనే చందంగా చిత్రీకరించేందుకు టీడీపీ తనదైన ప్రయత్నం చేసింది. వాస్తవానికి అలాంటి పరిస్థితి లేదని చూస్తున్న వారందరికీ తెలుసు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వ్యూహాలకు పదును పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రజా సమస్యలను పక్కన పెట్టి సభలో కొన్ని మీడియా సంస్థలను రానివ్వడం లేదు, మీడియా పాయింట్ నిర్వహణ లేదు అంటూ చిన్న చిన్న అంశాలను హైలెట్ చేయాలని చూస్తున్న టీడీపీ తీరు తేటతెల్లమవుతోంది. ఆపార్టీ వ్యూహాలు పేలవంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మానసికంగా అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కాలేకపోతున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా సభా సమావేశాల నిర్వహణలో బీఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేయడం టీడీపీకి మింగుడుపడని అంశమే.