iDreamPost
android-app
ios-app

ప్రతీకారం ఇచ్చిన అద్భుత తీర్పు – Nostalgia

  • Published Apr 04, 2021 | 12:56 PM Updated Updated Apr 04, 2021 | 12:56 PM
ప్రతీకారం ఇచ్చిన అద్భుత తీర్పు – Nostalgia

సరైన రీతిలో చూపించాలే కానీ క్లాసు మాస్ తేడా లేకుండా అన్ని వర్గాలను మెప్పించేలా రివెంజ్ డ్రామాలు తీసి విజయం సాధించవచ్చని గతంలో ఎందరో దర్శకులు ఋజువు చేశారు. తనకు అన్యాయం చేసిన విలన్ల మీద హీరో ప్రతీకారం తీర్చుకోవడం అనే కామన్ పాయింట్ అన్నిటిలోనూ కనిపించినప్పటికీ అందులో అసలు పాత్రధారి తాలూకు పెయిన్ ని ఎమోషన్ ని ఎంత బాగా ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తారు అనేదాని మీదే హిట్టు ఆధారపడి ఉంటుంది. దానికి మంచి ఉదాహరణ అంతిమ తీర్పు. సమాజంలో దుర్మార్గాలు చేసేవాళ్లను ఎవరూ ఏమి చేయలేరనే ధైర్యాన్ని ఓ సామాన్యుడు ఎలా బద్దలు కొట్టాడు అనేదే ఇందులో మెయిన్ పాయింట్.

1987లో మలయాళంలో మమ్ముట్టి హీరోగా జోషి దర్శకత్వంలో ‘న్యూఢిల్లీ’ అనే మూవీ వచ్చింది. అప్పటికి రెండేళ్ల నుంచి ఫ్లాపుల్లో ఉన్న మముకాకు ఇది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. రచన చేసింది డెన్నిస్ జోసెఫ్ అయినప్పటికీ ది ఆల్మైటీ అనే ఇంగ్లీష్ నవల స్ఫూర్తితో రాసుకున్నారు. విలన్ల దాష్టికం వల్ల అన్యాయంగా కాళ్ళు పోగొట్టుకుని జైలుపాలైన ఓ జర్నలిస్ట్ కొన్నేళ్ల తర్వాత బయటికి వచ్చి తనకు కారాగారంలో పరిచయమైన యువకుల సహాయంతో ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ ని జోషి డీల్ చేసిన తీరు ఆడియన్స్ కి బ్రహ్మాండంగా నచ్చింది. దీన్ని తెలుగులో జోషి డైరెక్షన్ లోనే కళ్యాణి ఫిలిమ్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో సినిమా స్కోప్ లో నిర్మించారు.

ఇక్కడ కృష్ణంరాజుది కూడా ఇంచుమించు మమ్ముట్టి పరిస్థితే. ఫామ్ తగ్గిపోయింది. కానీ 1988 మార్చి 18న విడుదలైన అంతిమతీర్పు మరోసారి ఆయనకు గొప్ప సక్సెస్ అందించింది. దీన్నే జోషి కన్నడలో అంబరీష్, హిందీలో జితేంద్రతో రీమేక్ చేశారు. మూడు భాషల్లో ఒకేసారి సురేష్ గోపి తెరకు పరిచయం అయ్యారు. జీన్స్ ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ కు ఇది చాలా పేరు తీసుకొచ్చింది. మన వెర్షన్లో విలన్లుగా నటించిన ప్రభాకర్ రెడ్డి, రంగనాథ్ లు వాటిని అద్భుతంగా పండించారు.సుమలత హీరోయిన్ కాగా మరో ముఖ్యపాత్ర ఊర్వశి చేసింది. పాటలే లేని ఈ రెండున్నర గంటల సినిమాకు శ్యామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. షూటింగ్ మొత్తం ఢిల్లీలోనే చేయడం విశేషం. సెకండ్ హాఫ్ లో వచ్చే రివెంజ్ ఎపిసోడ్స్ ని వన్ అఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ గా చెప్పుకోవచ్చు.