iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు కుప్పంలో ఎదురు గాలి వీస్తుందా..?

చంద్రబాబుకు కుప్పంలో ఎదురు గాలి వీస్తుందా..?

ఆయ‌న ప‌ద్నాలుగేళ్ల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రిగా చేసిన వ్య‌క్తి. అంత‌కు మించి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్నారు. న‌ల‌భై ఏళ్ల‌కు పైగానే రాజ‌కీయ అనుభ‌వం. ఆయ‌నే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు. అలాంటి వ్య‌క్తికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో డిపాజిట్లు రావ‌డం కూడా క‌ష్ట‌మ‌ని వైసీపీ నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న‌ రాజ‌కీయ ప‌రిస్థితులు, ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాలకు ఈ విధంగా ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి, చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న‌ప్ప‌టి నుంచీ తెలుగుదేశం ఎప్పుడూ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటోంది. జ‌గ‌న్ మాత్రం అవేమీ ప‌ట్టించుకోకుండా, పార్టీలు చూడ‌కుండా, అభివృద్ధిలో రాజ‌కీయాలు చేయ‌కుండా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కూ స‌మ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి కూడా కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు (సీఎండీఎఫ్‌) పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ నిధులు విడుదల చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే తేడా లేకుండా ఆయా నియోజకవర్గాల్లో పనుల కోసం అడిగిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ నిధులు మంజూరు చేయాలని సీఎం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు కోరిన వెంటనే కుప్పానికి కూడా కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేశారు.

అంతేకాకుండా.. నియోజకవర్గంలో వేలాది మందికి ఇళ్లపట్టాలు అందజేశారు. గత టీడీపీ హయాంలో కేవ‌లం ఐదు వేల మందికి ఇళ్లపట్టాలకు అనుమతి ఇచ్చి అందులో నాలుగు వేల మందికి మాత్రమే పంపిణీ చేశారు. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం కింద ఐదేళ్ల కాలంలో నాలుగు వేల మంది లబ్ధిపొందగా.. జ‌గ‌న్ స‌ర్కార్ రెండేళ్లలోనే అంత‌కు స‌రిస‌మానంగా స్థానికుల‌కు ల‌బ్ధి చేకూర్చారు.గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన ప్రజలందరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలోని సర్కారు, ఇతర యాజమాన్యాల బడుల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఆదుకుంది. 53,187 మంది తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.7978.05 లక్షలను జమచేసింది. గత పాలనలో పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పిల్లల చదువులకు అమ్మఒడి పథకంలో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించేలా గ్రానైట్‌ సర్వే స్టోన్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లి సమీపంలో పల్లార్లపల్లి వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్‌ ఏర్పాటవుతోంది. స‌ర్కార్ చేస్తున్న ఈ ప‌నుల‌న్నీ అక్క‌డ వైసీపీ ఖ్యాతిని పెంచుతున్నాయి. దీనికి తోడు బాబు ప‌ర్య‌ట‌న‌లోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. ఈ ప‌రిణామాల‌న్నీ కుప్పంలో చంద్ర‌బాబు ప్రాబ‌వాన్ని త‌గ్గించేలా ఉన్నాయి. ఇదే అదునుగా వైసీపీ నేత‌లు వాయిస్ పెంచుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గెలుపు క‌ష్ట‌మేన‌న్న ప్ర‌చారం చేస్తున్నారు. ఏ ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు కూడా రావడం కష్టమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తాజాగా వ్యాఖ్య‌లు చేశారు. ఇతర పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చి వైసీపీపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం ద్వారా ఆయ‌న అధికారానికి మ‌రింత దూరం కావాల్సిందేన‌ని పేర్కొన్నారు