iDreamPost
iDreamPost
సాధారణంగా అన్నా చెల్లి తమ్ముడు వదిన లాంటి టైటిల్స్ ఉన్న సినిమాలు అధిక శాతం సెంటిమెంట్ ని ఆధారంగా చేసుకుని భావోద్వేగాలను ప్రేరేపించే విధంగా ఉంటాయి. ఎంటర్ టైన్మెంట్ కి చోటు తక్కువ. కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ఎక్కువ ఇరికించలేం. కానీ చిరంజీవి లాంటి ఎవరెస్టు ఇమేజ్ ఉన్న హీరోతో చేసేటప్పుడు లెక్కలన్నీ పక్కాగా బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా అభిమానుల అంచనాలను తప్పకుండా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో రాఘవేంద్రరావు తీసిన ‘ఇద్దరు మిత్రులు’ అప్పటికే ఋజువు చేసింది. అందుకే 1999లో భూపతిరాజా ఈ కథను తీసుకొచ్చినప్పుడు చిరు ఇవన్నీ సరిచూసుకున్నాకే ‘అన్నయ్య’ను ఓకే చేశారు.
1997లో తన కం బ్యాక్ మూవీగా ‘హిట్లర్’ని అద్భుతంగా డీల్ చేసిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అంటే చిరుకి ప్రత్యేకమైన గౌరవం. తర్వాత ఈ కాంబోలో ఇంకో సినిమా చేయాలని అనుకున్నారు కానీ మూడేళ్ళకు కానీ సాధ్యపడలేదు. ‘రౌడీ అల్లుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత డాక్టర్ వెంకటేశ్వరరావు మెగాస్టార్ తో మరో సినిమా చేయాలనే ప్రయత్నంలో ఉండగా అన్నయ్య స్క్రిప్ట్ వచ్చింది. రచయిత సత్యానంద్ రెగ్యులర్ ట్రీట్మెంట్ తో కాకుండా పూర్తిగా గేర్ మార్చి కామెడీ ప్లస్ సెంటిమెంట్ రెండు సమపాళ్ళలో ఉండేలా తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చేసింది. సౌందర్య హీరోయిన్ గా సిమ్రాన్ స్పెషల్ సాంగ్ కోసం ఫిక్స్ అయిపోయారు.
మణిశర్మ తప్ప వేరే ఆప్షన్ ఇష్టపడని చిరు అన్నయ్యకు కూడా తననే రికమండ్ చేశారు. దానికి తగ్గట్టే మెలోడీ బ్రహ్మ సూపర్బ్ ట్యూన్స్ ఇచ్చారు. తమ్ముళ్లుగా ముందుగా శ్రీకాంత్, జెడిలను అనుకున్నారు కానీ ఆ అదృష్టం రవితేజ, వెంకట్ లను వరించింది. లారీ డ్రైవర్ రాజారామ్ గా చిరు అభినయం క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఆత్మారామ్ షేడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఆట కావాలా పాట కావాలా ఐటెం సాంగ్ మారుమ్రోగిపోయింది. 2000 జనవరి 7న రిలీజైన అన్నయ్యకు కేవలం వారం గ్యాప్ లో ‘కలిసుందాం రా’ రూపంలో భారీ పోటీ తగిలి కొంత తగ్గాల్సి వచ్చింది. అయినా కూడా వసూళ్లలో అప్పటిదాకా ఉన్న ‘చూడాలని ఉంది’ రికార్డులను బ్రేక్ చేసి అన్నయ్య రూపంలో మెగాస్టార్ కు మరో సూపర్ హిట్ అందించింది