Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నూతన కమిషనర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ కాలం ముగియబోతోంది. ఐదేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుగాంచారు.
నూతన ఎస్‌ఈసీ ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ప్రారంభించింది. ముగ్గురు పేర్లను ఎంపిక చేసి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిచనుంది. సీఎం సూచన మేరకు గవర్నర్ ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు. మాజీ ఐఏఎస్ అధికారులు ప్రేమ్ చంద్రారెడ్డి, శ్యామ్యుల్, నీలం సాహ్ని పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ముగ్గురులో సీఎం వైఎస్ జగన్.. నీలం సాహ్ని వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో నీలం సాహ్ని రెండో సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తన పనితీరుతో నీలం సాహ్ని సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం వైఎస్‌జగన్ నిర్ణయాలను వేగవంతంగా అమలు చేస్తూ ప్రశంసలందుకున్నారు. నీలం సాహ్ని సమర్ధతను చూసిన సీఎం వైఎస్ జగన్.. ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అనుకున్న విధంగా ఆమె సేవలను ఆరు నెలల పాటు వినియోగించుకున్నారు. నీలం సాహ్ని సమర్థత, పనితీరుపై పూర్తి స్పష్టతతో ఉన్న సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా ఆమెను ఎంపిక చేయడం లాంఛనమే కానుంది.
ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయబోతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన పదవీ కాలం పొడిగించాలనే కోరే అవకాశం లేనట్లే. ఒక వేళ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీకాలం పొడిగించాలని కోరితే.. ఆయన వినతిపై వైఎస్ జగన్ సర్కార్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమారే నిర్వహించి.. పదవీ విరమణ చేయాలని కోరుకుంటున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు.
ఎడ్డమంటే తెడ్డమనేలా రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించిన నిమ్మగడ్డ.. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఆ తర్వాత నిర్వహణలపై కోర్టులకు వెళ్లారు. టీడీపీ ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ధతు తెలిపింది. టీడీపీ మనసెరిగి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో పని చేశారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో కోర్టు నుంచి పలుమార్లు మొట్టికాయలు తిన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి నష్టం చేకూర్చేలా నిమ్మగడ్డ వ్యవహరించినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టడం అంతిమంగా టీడీపీకి నష్టం చేకూర్చింది. ఎన్నికల కమిషనర్ అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినా.. వైసీపీ మంచి ఫలితాలు సాధించిందనే భావన ప్రజల్లో నెలకొంది.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. పార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే జరిగి.. అక్కడ కూడా వైసీపీ ఏకపక్ష విజయాలు సాధిస్తే.. తమ విజయం సంపూర్ణమవుతుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే తన పదవీ కాలం పొడిగించమనే ప్రతిపాదన నిమ్మగడ్డ చేయకపోవచ్చు. వెరసి ఆయన దిగిపోయిన వెంటనే కొత్త కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్లే.
Also Read : పరిషత్ ఎన్నికలు నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే జరుగుతాయా..?