iDreamPost
android-app
ios-app

సృష్టించిన సంపద ఏది..? పెంచిన ఆదాయం ఎక్కడ..?

సృష్టించిన సంపద ఏది..? పెంచిన ఆదాయం ఎక్కడ..?

‘ సంపద సృష్టించా.. ఆదాయం పెంచా’’నంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచూ తన ప్రశంగాలలో పలుకుతుంటారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పులు ఎంత..? చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత 2019 నాటికి రాష్ట్ర అప్పు ఎంత..? అనే వివరాలు పరిశీలిస్తే ఆయన సంపద సృష్టించి ఆదాయం పెంచారా..? లేక అప్పులు పెంచారా..? అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. గూగూల్‌లో వెతికినా ఈ సమాచారం తెలుస్తుంది. అయినా కూడా చంద్రబాబు పదే పదే అదే మాటను గొప్పగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత 2014 జూన్‌ 2 వరకు 61 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పు 1.66 లక్షల కోట్ల రూపాయలు. విభజనలో ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన 58:42 రేషియో చొప్పన ఏపీ, తెలంగాణలకు పంచారు. ఈ లెక్కన 1.66 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఏపీ వాటాగా 96 వేల కోట్ల రూపాయలు, తెలంగాణకు 70 వేల కోట్ల రూపాయల అప్పులు వచ్చాయి.

విభజన తర్వాత మిగిలిన 13 జిల్లాలకు రాజధాని కూడా లేదని, అనుభవజ్ఞుడనే కారణంతో ఏపీ ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించారు. అయితే ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానరాకపోయినా అప్పులు మాత్రం కనిపిస్తున్నాయి. బాబు ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్ర అప్పును 3.65 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. అంటే ఐదేళ్లలో కొత్తగా 2.69 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. 63 ఏళ్లకు గాను 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పు 1.66 లక్షల కోట్లు కాగా.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం 2.69 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ప్రతి ఏడాది వివిధ ప్రభుత్త విభాగాల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా సొమ్ములు, ఇతర గ్రాంటులు కాకుండానే.. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో 2.69 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. మరి ఈ సొమ్ముతో ఏమి చేసింది..? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడా దొరకదు. చంద్రబాబు కానీ, ఆయన ప్రభుత్వంలో మేధావిగా ఆర్థిక మంత్రిత్వశాఖను పర్యవేక్షించిన యనమల రామకృష్ణుడు గానీ ఎన్నడూ ఈ సొమ్ములు ఎందుకు ఖర్చు చేశామో చెప్పరు. 1.09 లక్షల కోట్ల వ్యయం అయ్యే అమరావతి పూర్తి కాలేదు. 56 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే పోలవరం ప్రాజెక్టు బాబు హాయంలో పూర్తి కాలేదు. అమరావతికి 10 వేల కోట్లు ( ఇందులో 2500 కోట్లు కేంద్రం ఇచ్చింది) ఖర్చు పెట్టామని చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంతా కేంద్రమే ఇస్తోంది. ఐదేళ్లలో ప్రజలకు నేరుగా నగదు అందే ఒక్క సంక్షేమ పథకం కొత్తగా ప్రవేశపెట్టలేదు.

ఇటు అభివృద్ధికి, అటు సంక్షేమ పథకాలకు కాకుండా చంద్రబాబు తన ఐదేళ్ల పాలనా కాలంలో అప్పు రూపంలో తీసుకువచ్చిన 2.69 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి..? 2019లో సీఎంగా దిగిపోతే రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు భగవద్గీతగా భావించే ఈనాడే రాసింది.

అప్పు తెచ్చిన వాడు ఆ సొమ్మును దేనికి ఎంతెంత ఖర్చు చేశారన్న వివరాలు చెబుతాడు. కానీ చంద్రబాబు ఇప్పటి వరకూ ఆ వివరాలు వెల్లడించలేదు. ఈసారి జరగబోయే జూమ్‌ ప్రెస్‌మీట్‌లో ఈ అప్పుల లెక్కలు కూడా చెబుతూ చంద్రబాబు ప్రజలను చైతన్యవంతులను చేస్తారా..? తాను నిప్పులా బతికానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఈ వివరాలు చెబితే నిజంగా ఆయన నిప్పేనని రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంది.