iDreamPost
iDreamPost
వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చాక ప్రతి అంశంలోనూ రంధ్రాన్వేషణ చేయడం ఆంధ్రజ్యోతి సంపాదకులు వేమూరి రాధాకృష్ణ నిత్యకృత్యంగా మారిపోయిందన్నది అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణ. తమకు కూడా ఎబ్బెట్టుగా తోచే విధంగానే వారి రాతలు ఉంటున్నాయన్నది పలువురి పాఠకుల అభిప్రాయంగాను తోస్తోంది. అయితే రంధ్రాన్వేషణ స్థాయి రోజురోజుకూ పెరగిపోతోంది. ఇదెంతగా వెళుతోందంటే అర్థసత్యాలను మాత్రమే డబ్బులు పెట్టి పేపర్ కొంటున్న వాళ్ళకు చేరవేసేంతగా పెరిగిపోయింది.
పైన చెప్పిన లైనుకు, క్రింద రాసిన లైనుకు కూడా ఏ మాత్రం పొసగకుండా ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతిలో అచ్చేస్తున్నారన్నది పలువురు మీడియా ప్రముఖులు కూడా ఆక్షేపిస్తున్నారు. అయినప్పటి తన ధోరణిని మాత్రం రాధాకృష్ణమార్చుకోవడం లేదంటున్నారు. సోమవారం నాటి సంచికలో.. రైతుకు జల ‘కలే’ పేరిట బ్యానర్ ఐటమ్‌ను రాసేసుకున్నారు. అంత వరకు బాగానే ఉంది. అందులో ఇచ్చిన వివరాలే ఆక్షేపణీయంగా ఉన్నాయని పలువురు రైతులు చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో ఎంతో చేసేసారు, ఇప్పుడీ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని తన పాఠకుల్ని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా కొనసాగిస్తున్న అప్రతిహత కథనాల కోవకు చెందిందే ఈ కథనం కూడాను. ఎన్టీఆర్ జలసిరి క్రింద ఎస్సీ, ఎస్టీ వర్గాలు 6వేలు, ఇతర వర్గాలు 25వేలు చెల్లిస్తే అన్నీ ఇచ్చేసేవారని అచ్చేసుకున్నారు. వాస్తవ పరిస్థితిని గమనిస్తే ఇందుకు పూర్తిభిన్నంగా ఉంటుందని ఆ పథకంలో లబ్దిదారులు చెబుతున్నారు.
5హెచ్‌పీ సోలార్ మోటారును ఏర్పాటు చేయాలంటే రైతు వాటాగా రూ. 55వేలు కట్టాల్సి ఉండేదని వివరిస్తున్నారు. ఒక వేళ ఎన్టీఆర్ జలసిరి పథకం క్రింద లబ్దిదారుడు ఎంపికైతే రూ. 25వేలు వెనక్కి రీ ఎంబార్స్‌మెంట్‌చేస్తామని ప్రకటించారని చెబుతున్నారు. అయితే ఈ విధంగా ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు వెనక్కి డబ్బులు వచ్చాయో కూడా అర్ధం కాని పరిస్థితి ఉండేదంటున్నారు. అంటే ఆంధ్రజ్యోతి చెబుతున్నట్టు రూ. 25వేలు కాకుండా రైతులు మాత్రం 55వేలు కట్టారన్న మాట. వారికి తిరిగి రీ ఎంబార్స్‌మెంట్ జరగలేదన్నది రైతుల మాటను బట్టి తేలుతోంది. అయినప్పటికీ ఇటువంటి వాటిని పక్కన పెట్టేసి కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఎంతో చేసేసింది, జగన్ మాత్రం చెయ్యడం లేదని చెప్పడమే ప్రధాన ద్యేయంగా ఈ కథనం సాగడం దారుణంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా 200 అడుగుల బోరు బావిని ప్రభుత్వ తవ్వి, 5హెచ్‌పీ సోలార్ మోటార్, ప్యానల్స్ ఏర్పాటు చేసేవారని రాసుకొచ్చారు.
వాస్తవ పరిస్థితిలోకొస్తే 7 అంగుళాల వెడల్పుతో బోరును రైతులే తవ్వించుకోవాల్సి వచ్చేది. ఈ పథకంపై గైడ్‌లైన్స్ స్పష్టంగా లేకపోవడంతో ఒకే బోరును రెండుసార్లు తవ్వించుఓవాల్సిన దుస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే 5హెచ్‌పీ సోలార్ సబ్‌మెర్సిబుల్ మోటారు ఆరు అంగుళాలు వెడల్పుతో ఉంటుంది. సాధారణంగా రైతులు 4 లేదా 5 అంగుళాల వెడల్పుతో బోర్లు తవ్వి గొట్టాలు ఏర్పాటు చేస్తారు. అసలు ఏ మోటారు ఇస్తారు? రైతులు ఏం చెయ్యాలన్నది చెప్పకుండా హడావిడిగా బోర్లు తవ్వేసుకోమనేవారు. తీరా సబ్‌మెర్సిబుల్‌మోటార్లు వచ్చాక బిగించే ముందు చూస్తే అవి ఆ గొట్టాల్లోకి దూరేవి కావు. దీంతో మళ్ళీ బోరును 7 అంగుళాలకు తవ్వించాల్సి వచ్చేది. అంటే రైతుకు రెండు సార్లు ఖర్చయ్యేది. పోనీ రీ ఎంబార్స్‌మెంట్ రూపంలో డబ్బులు వెనక్కి ఇచ్చారా అంటే అదీ లేదాయె.
ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నట్టు 5 హెచ్‌పీ సోలార్ మోటారును రూ. 25వేలకే ఏర్పాటు చేయలేదు. రాజమహేంద్రవం డివిజన్ పరిధిలో పలువురు రైతులు రూ. 3లక్షల 75వేలు విలువచేసే 3హెచ్‌పీ మోటారుకు రూ. 27వేల వరకు, 5లక్షల50వేల రూపాయలు విలువైన 5 హెచ్‌పీ మోటారుకు రూ. 55వేలు వరకు డీడీల రూపంలో చెల్లించారు. సోలార్ మోటార్ల ధరల విషయంలో కూడా ముందుగా చెప్పిన ధరలకు, ఆ తరువాత అమలు చేసిన ధరలకు చాలా వ్యత్యాసం ఉందని రైతులు చెబుతున్నారు.
ఇలా ఏర్పాటు చేసిన మోటార్ల నిర్వహణ అయిదేళ్ళ పాటు సదరు సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందు కోసం వారికి డబ్బులు కూడా చెల్లించారు. అయితే సోలార్ మోటార్లు వేయించుకున్న రైతులకు ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎవరు నిర్వహణ చేస్తారు? అన్నది ఇప్పటిక్కూడా బ్రహ్మరహస్యంగానే ఉంది. ఒక వేళ ఎవరికైనా మోటార్లు రిపేరు వస్తే ఇక ఆ రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతానికి కూడా ఇదే పరిస్థితిలో రైతులు ఉన్నారు. సోలార్‌ల నిర్వహణా బాధ్యత క్షేత్రస్థాయిలో విద్యుత్ సంస్థలకు అప్పగించారు. అయితే సదరు అధికారులు చెప్పినప్పటికీ సోలార్ నిర్వహణా సంస్థల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంలో ఘనంగా చేసేసారని చెప్పడం ఆంధ్రజ్యోతి దిగజారుడు తనానికి పరాకష్టగా రైతులు భావిస్తున్నారు.
సూక్ష్మ సేద్య పరికరాలకు సంబంధించి చంద్రబాబు బకాయి పడ్డ 400 కోట్లు జగన్ చెల్లించడం లేదని, అందుకే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని రాసుకొచ్చారు. అయితే పథకం ప్రారంభించింది 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఆ ఒక్కయేడాదిలోనే చేసిన పనులకు కూడా చంద్రబాబు ఎందుకు బిల్లులు చెల్లించలేదన్నది మాత్రం అక్కడ రాయలేకపోయారు. బిందు సేద్యంపై సమీక్షిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కార్యాచరణ ప్రకటించలేదు. అయినప్పటికి ఆంధ్రజ్యోతి ద్వారా బురదజల్లుడు మాత్రం మానలేకపోయారు.
మరో వైపు ఎన్టీఆర్ జలసిరి పథకానికి లబ్దిదారుల ఎంపిక బాద్యత కూడా జన్మభూమి కమిటీలదే పెత్తనం. దీంతో రైతులు తమ పనులు మానుకుని కమిటీ సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. తమకు కావాల్సిన వారికి మాత్రమే పథకానికి ఎంపిక చేసేవారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నేరుగా వెబ్‌సైట్‌లోనే రైతులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తద్వారా రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరిగుతుంది.
అయితే వీటన్నిటినీ మరుగున పడేసి ఇప్పుడు వైఎస్ జగన్ ప్రకటిస్తున్న పథకాన్ని చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
చివరాకర్న పాపం ఉబ్బు ఆపుకోలేక మోటార్లెవరిస్తారూ అంటూ.. ఉప శీర్షిక కూడా పెట్టేసారు. అయితే చెప్పిందే కాకుండా, చెప్పనది కూడా చేసి చూపిస్తున్న జగన్ పథకం ప్రారంభం సందర్భంగా మోటార్లు కూడా ప్రభుత్వమే ఇస్తుందని ప్రకటించేసారు. సో.. సోమవారం నాటి కథనం ద్వారా పేపర్‌లో ప్లేస్, ఇంకు వేస్టు తప్పితే ఆంధ్రజ్యోతికి తద్వారా రాధాకృష్ణకు వీరు భుజనికెత్తుకున్న వారికి ఏం ప్రయోజనం కలిగిందో వారే ఆలోచించుకోవాలి.