iDreamPost
iDreamPost
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా..ముంపు మండలాలను మళ్లీ తెలంగాణాలో కలపాలనే డిమాండ్ వస్తుందా..పోలవరం వల్ల కలిగే ప్రయోజనాలకు ఆటంకం ఏర్పడుతుందా.. ప్రజల ఆశలు అడియాశలవుతున్నాయా.. అన్నింటికీ మించి చంద్రబాబు కష్టపడి సాధించినదంతా వృధా అవుతోందా .. ఇలా సాగుతున్నాయి ఆంధ్రజ్యోతి కథనాలు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ పత్రిక కథనాలు పూర్తి సత్యదూరం అని ఆ పేపర్లోనే వివరణ ఇస్తుంటారు. మళ్లీ పెద్ద పెద్ద హెడ్డింగులతో అబద్ధాలు వండివార్చుతుంటారు. ఇదేమీ వింత కాదు..ఆంధ్రజ్యోతికి అది కొత్త కాదు. కానీ పోలవరం విషయంలో ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త తగాదాకి తెరలేపే యత్నం చేయడం మాత్రం గమనార్హం.
ఏపీలో వైఎస్ జగన్, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. అనేక సమస్యలు వస్తున్నా సామరస్యంతో పరిష్కరించుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ఉభయ రాష్ట్రాలు సఖ్యతతో సాగుతూ సమస్యలపై దృష్టి పెడుతున్నాయి. ఇది కొందరికి రుచించడం లేదు. చంద్రబాబు లాంటి వారికి జీర్ణం చేసుకోలేని అంశమయ్యింది. అందుకే ఆంధ్రజ్యోతికి అత్యవసరంగా ఇరు ప్రభుత్వాల మధ్య వివాదాలు రాజేసే ప్రయత్నాలకు దిగాల్సి వచ్చింది. ఆర్టీసీ విషయంలో అలాంటి ప్రయత్నమే జరిగినా చివరకు ఒప్పందం జరిగి, బస్సులు రోడ్డెక్కాయి. ఆ ఒప్పందం వల్ల ఏదో జరిగిపోయిందని మళ్లీ మొదలెట్టింది. అసలు మూడు నెలలు బస్సులు తిరగకపోతే వచ్చిన నష్టం కన్నా తిరిగిన తర్వాత కలిగే ప్రయోజనాలు ఎక్కువే కదా అంటే అది ఆంధ్రజ్యోతికి అనవసరం. ఇక ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి లెక్కలతో పోలిస్తే కొంత సర్థుబాటు తప్పదు కదా. అయినా ఆంధ్రజ్యోతి అదే మీ కదురదు అంటుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడమే తగదన్నట్టు రాస్తున్న రాతలతో తయారవుతోంది.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎత్తు తగ్గింపు ప్రతిపాదనలు లేవని 45.72 మీటర్లకు నిర్మాణం ఉంటుందని సీఈ బి సుధాకర్ బాబు వివరణ ఓవైపు ప్రచురిస్తోంది. వాటిని చిన్న అక్షరాల్లో రాస్తూ బ్యానర్ హెడ్డింగులో మాత్రం ప్రాజెక్ట్ నిర్మాణం 41.15 మీటర్లకే పరిమితం అంటూ టాంటాం వేస్తుంది. దశల వారీగా ప్రాజెక్ట్ ఎత్తు పెరుగుతుందని వివరణ ఇస్తూనే ఎత్తు తగ్గించేస్తున్నారని, దాని ఫలితంగా ముంపు మండలాల పరిస్థితి ఏమిటనే ఆందోళన ఎందుకంటే అది ఆంధ్రజ్యోతికే తెలియాలి. వచ్చే మార్చి నాటికి 41.15 అడుగులకు నీటి మట్టం చేరుతుందని, తర్వాత అది డిసెంబర్ నాటికి 45.72 అడుగులకు దశల వారీగా పెరుగుతుందని పోలవరం అధికారులు చెబుతున్నా ఆంధ్రజ్యోతికి పట్టదా.. అర్థం లేని రాతల వెనుక అసలు లక్ష్యం ప్రజల్లో అపోహలు పెంచడమే తప్ప అంతకుమించి లేదని గ్రహిస్తే ఈ రాతల మర్మం మనకు బాగా తెలుస్తుంది.
41.15 అడుగులకు నీటిమట్టం చేరగానే వీఆర్ పురం మండలంలోని 20 గ్రామాలకు గోదావరి వరద నీరు చేరుతుంది. కూనవరం మండల కేంద్రానికి కూడా బ్యాక్ వాటర్ చేరుతుంది. అదే సమయంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని మరో 20 గ్రామాలు జలమయం అవుతాయి. దానికి అనుగుణంగానే తొలి దశలో మార్చి నాటికి ముంపు బారిన పడే గ్రామాలకు పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం అందించే దిశలో సాగుతోంది. దానికి అనుగుణంగా కాలనీల నిర్మాణంపై శ్రద్ధ పెట్టింది. దానిని పట్టుకుని తొలి దశ లెక్కలతోనే మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి చిత్రీకరిస్తోంది. పైగా వీలీన మండలాలకు అసలు ముంపు సమస్య లేదన్నట్టుగా సూత్రీకరిస్తోంది. కానీ ఇటీవల పీపీఏ మీటింగ్ లో ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న బూర్గంపహాడ్ మండలానికి కూడా తొలి దశలో పోలవరం బ్యాక్ వాటర్ తాకిడి ఉంటుందని ఆరాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడిన విషయాన్ని ఆంధ్రజ్యోతి దాచిపెడుతోంది. అంటే ఎగువన ఉన్న బూర్గంపహాడ్ కే బ్యాక్ వాటర్ చేరితే దిగువన ఉన్న వీఆర్ పురం, కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం మండలాలకు వరద తాకిడి ఉండదని ఎలా అనుకోవాలి. పైగా ఆ మండలాలను మళ్లీ తెలంగాణాకి ఇచ్చేయాల్సి వస్తుందనేటంత స్థాయిలో చిత్రీకరణలకు పూనుకోవడం ఆంధ్రజ్యోతి అర్థరహిత వాదనలకు దర్పణం పడుతుంది.
నిజానికి పోలవరం ప్రాజెక్ట్ ని నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులతో పోల్చి చూడకూడదు. కృష్ణా నదీ జలాలకు, గోదావరికి చాలా వైరుధ్యం ఉంటుంది. కృష్ణా నది వరదలతో పోలిస్తే గోదావరికి కాస్త గ్యారంటీ ఉంటుంది. ప్రతీ ఏటా కనీస స్థాయిలో వరద ప్రవాహం ఉంటుంది. వరద ప్రవాహ సమయంలో ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు, ఉత్తరాంధ్రకు తరలించే అవకాశం పోలవరం ప్రాజెక్ట్ కి ఉంటుంది. తద్వారా వృధాగా పోతున్న నదీ జలాల వినియోగానికి ఆస్కారం ఉంటుంది. ఇక శ్రీశైలం వాస్తవ నిల్వ సామర్థ్యం 308 టీఎంసీలు కాగా పోలవరం వద్ద అది 150 టీఎంసీల లోపు మాత్రమేనన్నది అర్థమయితే రెండు ప్రాజెక్టుల మధ్య వైరుధ్యం అర్థమవుతుంది. అయినా గానీ ఎత్తు విషయంలో హంగామా చేసి, ప్రజల్లో ఏదో జరుగుతుందనే అనవసర ఆందోళన క్రియేట్ చేసే ప్రయత్నంలో ఆంధ్రజ్యోతి అభాసుపాలవుతుందని గ్రహిస్తే మంచిది. నదీ జలాల వినియోగంపై గతంలో వైఎస్సార్, ప్రస్తుతం జగన్ ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా పోలవరం సహా పలు పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. అయినప్పటికీ చంద్రబాబుకి లేని గొప్ప ఆపాదించే ప్రయత్నంలో కార్యసాధకులను తక్కువ చేయాలనే యత్నం ఫలించదని ఆ పత్రికకు ఎంత చెప్పినా అర్థంకాదని పాఠకులు ఎప్పుడో అర్థం చేసుకున్నారు.