iDreamPost
iDreamPost
ఆంధ్రజ్యోతి పత్రిక న్యాయస్థానాలకు ఇటు ప్రభుత్వానికి సంబంధించి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు సదరు పత్రిక మెడకే చుట్టుకోబోతున్నాయా అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా చంద్రబాబు ప్రధానికి ఇదే అంశంపై లేఖ రాయడంతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపి, చంద్రబాబు తమ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించాల్సిందిగా కోరారు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ ఆరోపణలపై ఆధారాలు ఏమిటో అడగండి అంటూ ఈ వాజ్యంలో ఆంధ్రజ్యోతి పత్రికను కూడా ప్రతివాదిగా చేర్చమని అప్పుడే వాస్తవాలు కుట్ర బహిర్గతం అవుతాయని కోర్టుని అభ్యర్ధించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధన పై సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం తదుపరి విచారణ 20కి వాయిదా వేసింది.
గతంలో పత్రికల్లో న్యాయమూర్తులకు సంబంధించి చేసిన వాఖ్యలపై హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించిన ఉదంతాలు ఉన్నాయి. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావు అలియాస్ అహోబిల రావు 2009 ఏప్రిల్లో తనకు సన్నిహితుడైన ఒక వ్యక్తితో చంద్రబాబుతో తనకి ఉన్న సాన్నిహిత్యం గురించి, IMG భారత్ కోసం పొందిన భూములతో సహా కొన్ని ఒప్పందాల గురించి చెబుతూ… సాక్షి స్పై కెమెరాకు చిక్కాడు. ఆ సంభాషణ మధ్యలో బిల్లీ రావు, చంద్రబాబు తలచుకుంటే హై కోర్టులోని జడ్జిలను మేనేజ్ చెయ్యగలడు అని కూడా చెప్పడంతో అదే విషయాన్ని సాక్షి వార్తా పత్రికలో, మీడియా చానల్ లో “బిల్లీ మెడలో బాబు గంట” శీర్షికతో ప్రచురించింది.
Also Read: CBI బాబుకు నాడు వద్దు.. నేడు ముద్దు..
ఆయితే న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల పై కథనం ప్రచురించినందుకు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును సుమోటోగా తీసుకుని కోర్టు ధిక్కరణగా భావించి ఆనాడు కోర్టు సెలవు అయినా ప్రత్యేకంగా పరిగణిస్తూ జస్టిస్ జి రఘురామ్, జస్టిస్ పివి సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం అప్పటికి రాజకీయల్లో లేని జగన్‌తో పాటు ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి ఇందిరా టెలివిజన్ సీఈవో ప్రియదర్శిని రామ్ కు నోటీసులు పంపించింది.
ఆధారాలు ఉన్నా న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఒక వ్యక్తి చేసిన వాఖ్యలను నేరుగా ప్రచురించినందుకే కోర్టు ధిక్కరణగా పరిగణించినపుడు, రేపటి రోజున ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకా చానల్ లో జడ్జీలకు, ప్రభుత్వానికి సంబంధించి చేసిన ఆరోపణల వ్యవహారంలో సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించడంలో విఫలం చెందితే రాష్ట్ర హైకోర్టు గతంలో మాదిరే ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా పరిగణించే అవకాశం లేకపోలేదు అని విశ్లేషకుల మాట. రాబోయే రోజుల్లో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనంపై సదరు పత్రిక ఇటు ప్రభుత్వం నుండి అటు కోర్టుల నుండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతోందో వేచి చూడాలి.
Also Read: రాజధాని పై రెండోసారి తేల్చేసిన కేంద్రం